అక్షరటుడే, బాన్సువాడ: ISRO Student Visit | సాంకేతిక, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని బాన్సువాడ (Banswada) ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులకు ఇస్రోను సందర్శించేందుకు పట్టణంలోని భారతరత్న జూనియర్ కళాశాలలో అర్హత పరీక్షలు నిర్వహించారు.
ISRO Student Visit | అంతరిక్ష పరిశోధనలు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆధునిక యుగంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆర్డీవో తెలిపారు. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల ప్రయోగాలు, సాంకేతిక ఆవిష్కరణల్లో భారతదేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు. ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థను సందర్శించడం విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు, పరిశోధనాత్మక దృక్పథం, శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందిస్తుందని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఇలాంటి అవకాశాలు కల్పించడం ఎంతో ప్రోత్సాహకరమని పేర్కొన్నారు.
ISRO Student Visit | పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా..
విద్యార్థినులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా పరిసరాల్లో జరుగుతున్న శాస్త్రీయ పరిణామాలను గమనించాలని, కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన కలిగి ఉండాలని ఆయన సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే అనుకున్న విజయాలను సాధించవచ్చన్నారు. ఇస్రో సందర్శనకు ఎంపికయ్యే విద్యార్థినులు అక్కడి శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రయోగాలు, రాకెట్ ప్రయోగ కేంద్రాల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నాగేశ్వరరావు, జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుషాల్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: BRS Rythu Garjana | రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట