అక్షరటుడే వెబ్‌డెస్క్: US Midterm Election Results | అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. యుఎస్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనెట్ రెండింటిలోనూ డెమోక్రటిక్ పార్టీ ఘనవిజయం సాధించి స్పష్టమైన మెజారిటీని కైవసం చేసుకుంది. ఈ ఫలితాలతో వాషింగ్టన్ రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోగా, ఓటమికి బాధ్యత వహించే విషయంలో వైట్ హౌస్ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య ఇరాన్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
US Midterm Election Results | రిపబ్లికన్ ఆధిపత్యం..
ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు యుఎస్ కాంగ్రెస్ రెండు సభలలోనూ తమ పట్టును పూర్తిగా కోల్పోయారు. ప్రతినిధుల సభలో మెజారిటీకి 218 సీట్లు అవసరం కాగా, డెమోక్రాట్లు 228 స్థానాల్లో నెగ్గి ఆధిపత్యాన్ని సాధించారు. రిపబ్లికన్లు కేవలం 139 సీట్లకే పరిమితమయ్యారు. ఇక 100 స్థానాలున్న సెనెట్‌లోనూ మెజారిటీ మార్కు (51) దాటి డెమోక్రాట్లు 54 సీట్లు సాధించగా, రిపబ్లికన్లకు 44 స్థానాలే దక్కాయి. దీనితో రాబోయే కాలంలో ట్రంప్ తన బిల్లులు, విధానపరమైన నిర్ణయాలను కాంగ్రెస్‌లో నెగ్గించుకోవడం అత్యంత సంక్లిష్టంగా మారనుంది.
US Midterm Election Results | ఓటమికి ఇరాన్ యుద్ధమే ..
రిపబ్లికన్ల ఈ ఘోర పరాజయానికి ఇరాన్‌పై జరిపిన యుద్ధమే ప్రధాన కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. యుద్ధం కారణంగానే రాబోయే ఆరేళ్ల పాటు సెనెట్‌లో పట్టు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ మాత్రం తన సైనిక చర్యను సమర్థించుకుంటూనే ఉన్నారు. వాన్స్ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్, ఆయన భావోద్వేగాలను అర్థం చేసుకోగలనని, యుద్ధ ప్రభావం ఓటింగ్‌పై పడిన మాట వాస్తవమే అయినప్పటికీ దేశ హితం దృష్ట్యా అది సరైన నిర్ణయమేనని ధీమా వ్యక్తం చేశారు.
US Midterm Election Results | డెమోక్రాట్లకు మద్దతుగా..
లక్ష మందికి పైగా ఓటర్లతో నిర్వహించిన సర్వేలో దాదాపు 60 శాతం మంది అమెరికన్లు ఇరాన్ తీవ్రతను, దానిపై దాడిని తప్పుపట్టారు. ఈ అసంతృప్తితోనే అత్యధిక శాతం ఓటర్లు డెమోక్రాట్లకు మద్దతుగా ఓటేశారు. యుద్ధంతో పాటు పెరిగిన ద్రవ్యోల్బణం, పాలనాపరమైన అవినీతి కూడా ఓటర్ల తీర్పును ప్రభావితం చేశాయి. డెమోక్రటిక్ మద్దతుదారులు ముక్తకంఠంతో యుద్ధాన్ని నిరసించగా, రిపబ్లికన్ ఓటర్లలో 10 మందిలో 8 మంది మాత్రం ట్రంప్ చర్యలను సమర్థించడం గమనార్హం.
US Midterm Election Results | ఎన్నికల రేసుపై కన్ను?
ఇరాక్ యుద్ధంలో పనిచేసిన మాజీ మెరైన్ అయిన జేడీ వాన్స్ మొదట్నుంచీ విదేశీ సైనిక జోక్యాలను వ్యతిరేకిస్తున్నారు. 2028 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే ఆలోచనతోనే ఆయన ట్రంప్ నిర్ణయాలకు భిన్నంగా మాట్లాడటం ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం యుద్ధమే కాకుండా ద్రవ్యోల్బణం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, ఇజ్రాయెల్ విధానాలను కూడా ఆయన తన పోస్ట్‌లో ప్రస్తావించారు.
మరొకవైపు 36 రాష్ట్రాల్లో జరిగిన గవర్నర్ ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు 22 చోట్ల విజయం సాధించి ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, రిపబ్లికన్లు 12 స్థానాలకే పరిమితమయ్యారు. మొత్తానికి ఈ ఫలితాలు వైట్ హౌస్‌ను కుదిపేయడమే కాకుండా ట్రంప్, వాన్స్ మధ్య రాజకీయ విభేదాలను తీవ్రస్థాయికి చేర్చాయి.
ఇది కూడా చదవండి: US Midterm Elections | ట్రంప్‌లాగే.. మోదీ ఓడిపోతారు : విపక్షాలు