AI Job Crisis | వచ్చే ఐదేళ్లలో తీవ్ర ఉద్యోగ సంక్షోభం.. ఆంథ్రోపిక్ సీఈవో సంచలన హెచ్చరిక

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: AI Job Crisis | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత శరవేగంగా దూసుకుపోతోంది. అయితే ఈ ఏఐ విప్లవం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ (Anthropic) ప్రధాన కార్యనిర్వాహక అధికారి (CEO) డారియో అమోడెయ్ సంచలన హెచ్చరికలు చేశారు. పరిశ్రమలలో ఎంట్రీ-లెవల్ వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ వ్యవస్థలు భర్తీ చేయడం వల్ల తీవ్రమైన ఉపాధి సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏషియానెట్ న్యూసబుల్ కథనం ప్రకారం ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

AI Job Crisis | వైట్-కాలర్ ఉద్యోగాలకే పెద్ద ముప్పు..

ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డారియో అమోడెయ్ ఏఐ అభివృద్ధి వేగం గురించి మాట్లాడారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ టెక్నాలజీ ఊహించని స్థాయికి చేరిందన్నారు. “రెండు సంవత్సరాల క్రితం ఏఐ సామర్థ్యం ఒక తెలివైన హైస్కూల్ విద్యార్థిలా ఉండేది. కానీ ఇప్పుడు అది ఓ తెలివైన కాలేజీ స్టూడెంట్ స్థాయిని దాటిపోతోంది” అని వివరించారు. వైద్యం, ఇంధన రంగాల్లో ఏఐ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. విశ్లేషణ, పరిపాలన (Administrative) పనులపై ఆధారపడే రంగాలకు దీనివల్ల పెద్ద ముప్పు పొంచి ఉందన్నారు. ఫైనాన్స్, కన్సల్టింగ్, ఐటీ వంటి రంగాల్లో డాక్యుమెంట్లను సంగ్రహించడం, ఆర్థిక నివేదికలు తయారు చేయడం, సరికొత్త ఐడియాలను బ్రెయిన్‌స్టార్మింగ్ చేయడం వంటి ప్రారంభ స్థాయి ఉద్యోగాలను (Entry-level jobs) ఏఐ సాఫ్ట్‌వేర్‌లు సులభంగా రీప్లేస్ చేస్తాయని ఆయన భయపడుతున్నారు. ఈ మార్పు ఒకటి నుండి ఐదేళ్ల లోపే కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

AI Job Crisis | పూర్తి అవగాహన రాకపోవడం..

ఈ ఉద్యోగ సంక్షేమం గురించి అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలు, ఏఐ రంగానికి చెందిన ప్రముఖులు వ్యక్తిగత సంభాషణల్లో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని అమోడెయ్ లీక్ చేశారు. అయితే ఈ సమస్య తీవ్రత గురించి సామాన్య ప్రజలకు కానీ, చట్టాలు చేసే ప్రభుత్వ ప్రతినిధులకు కానీ ఇంకా పూర్తి అవగాహన రాకపోవడం విచారకరమన్నారు. “ఏఐ రేసును ఇప్పుడు ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకవేళ అమెరికాలోని టాప్ 6 ఏఐ కంపెనీలు పరిశోధనలు ఆపేసినా.. చైనా మనల్ని అధిగమించి ముందుకు వెళ్తుంది” అని గ్లోబల్ కాంపిటీషన్ గురించి ఆయన స్పష్టం చేశారు.

AI Job Crisis | పరిహారంగా ఏఐ కంపెనీలపై పన్ను?

ఈ సంక్షేమాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు ఇప్పుడే మేల్కోవాలని అమోడెయ్ సూచించారు. ఉద్యోగులకు ఏఐ టూల్స్ వాడకంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఒక మార్గమని చెప్పారు. అలాగే ఆర్థిక సమతుల్యతను కాపాడేందుకు , ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు భవిష్యత్తులో మాలాంటి ఏఐ సంస్థలపై ప్రత్యేక పన్నులు విధించాల్సిన అవసరం రావచ్చు అంటూ ఆయన ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

ఇది కూడా చదవండి: Karnataka Border | కర్ణాటక చెత్త తెలంగాణలో డంప్​.. అడ్డుకున్న స్థానికులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *