Supreme Court Arrest Rules | అరెస్ట్​, నిర్బంధంపై సుప్రీంకోర్టు క్లారిటీ

పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోపు మేజిస్ట్రేట్​ ఎదుట హాజరు పర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court Arrest Rules | అరెస్ట్, నిర్బంధంపై సుప్రీంకోర్టు (Supreme Court) క్లారిటీ ఇచ్చింది. రెండింటికీ మధ్య తేడా లేదని స్పష్టం చేసింది. అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటలలోపు మేజిస్ట్రేట్​ ఎదుట హాజరు పర్చాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ గడువు అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుండి కాకుండా, అతడిని అదుపులోకి తీసుకున్న క్షణం నుండే ప్రారంభం అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

పలు కేసుల్లో పోలీసులు నిందితులను మొదట అదుపులోకి తీసుకుంటారు. అనంతరం అధికారికంగా ప్రకటించిన తర్వాత 24 గంటల్లోపు కోర్టులో హాజరు పరుస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రయోజనం కోసం అరెస్టు, నిర్బంధం మధ్య ఎలాంటి కృత్రిమ భేదం ఉండరాదని జస్టిస్‌లు ఉజ్జల్ భూయాన్. అతుల్ ఎస్ చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్టుకు ముందు నిర్బంధ కాలాన్ని మినహాయించడానికి పోలీసులను అనుమతించే ఏ వ్యాఖ్యానమైనా రాజ్యాంగ ఆదేశానికి విరుద్ధంగా ఉంటుందని తెలిపింది.

Supreme Court Arrest Rules | ఆ సమయాన్ని మినహాయించవచ్చు

24 గంటల గడువు అధికారిక అరెస్టు నుండే ప్రారంభమవుతుందనే అభిప్రాయం, ఆర్టికల్ 22(2), బీఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 56 రాజ్యాంగ ఆదేశానికి విరుద్ధం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 24 గంటల గడువును లెక్కించేటప్పుడు, అరెస్టు జరిగిన ప్రదేశం నుండి మేజిస్ట్రేట్ కోర్టుకు ప్రయాణించడానికి అవసరమైన సమయాన్ని మాత్రమే మినహాయించవచ్చని పేర్కొంది. అరెస్టుకు ముందు విచారణ, దర్యాప్తు, సోదాలు, స్వాధీనం కోసం వెచ్చించిన సమయాన్ని మినహాయించలేమని తెలిపింది.

Supreme Court Arrest Rules | వారిని విడుదల చేయాలి

ఆర్టికల్ 22(2) ప్రకారం అరెస్టు చేయబడి, కస్టడీలో ఉంచబడిన ప్రతి వ్యక్తిని, అరెస్టు చేసిన ప్రదేశం నుండి కోర్టుకు ప్రయాణానికి పట్టే సమయాన్ని మినహాయించి, 24 గంటలలోపు సమీపంలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని కోర్టు స్పష్టం చేసింది. 24 గంటల గడువు దాటిన తర్వాత కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా నిర్బంధంలో ఉన్న వ్యక్తిని తక్షణమే విడుదల చేయాలని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: CJP Pakistan Links | సీజేపీకి పాక్​తో సంబంధాలు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *