RBI NBFC License Cancellation | ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. ఒక్క దెబ్బతో 63 ఫైనాన్స్ సంస్థల లైసెన్సులు కట్..

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (NBFC) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉక్కుపాదం మోపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: RBI NBFC License Cancellation | నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (NBFC) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉక్కుపాదం మోపింది. ఒకేసారి ఏకంగా 63 ఫైనాన్స్ కంపెనీలపై కీలక చర్యలు తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 16న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 29 మధ్య కాలంలో వివిధ నిబంధనల ఉల్లంఘనలు , ఇతర కారణాల రీత్యా మొత్తం 49 ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసింది. దీనికి అదనంగా, మరో 13 ఎన్‌బీఎఫ్‌సీలు , ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ స్వచ్ఛందంగా తమ లైసెన్సులను వెనక్కి ఇచ్చేశాయి. ఆర్బీఐ చట్టం-1934 నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది.

RBI NBFC License Cancellation | అసలు కారణాలు ..

ఆర్బీఐ అందించిన వివరాల ప్రకారం.. 14 కంపెనీలు వివిధ వ్యక్తిగత, వ్యాపార కారణాల వల్ల స్వచ్ఛందంగా తమ రిజిస్ట్రేషన్లను వదులుకున్నాయి. వీటిలో 6 కంపెనీలు ఎన్‌బీఎఫ్‌సీలుగా తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశాయి. మరో 5 కంపెనీలకు ఇకపై రిజిస్ట్రేషన్ అవసరం లేదని తేలింది. మిగతా మూడు కంపెనీలు రద్దు కావడం లేదా ఇతరత్రా కారణాల వల్ల వ్యాపార కార్యకలాపాలు ఆగిపోవడంతో రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. లైసెన్సులు రద్దయిన లేదా సరెండర్ చేసిన ఏ కంపెనీ కూడా ఇకపై ఎన్‌బీఎఫ్‌సీగా పనిచేయడానికి వీలులేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే ఈ కంపెనీలు భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి రుణాలు ఇవ్వడానికి లేదా ఇతర ఆర్థిక సేవలు అందించడానికి అనర్హులుగా మారతాయి.

RBI NBFC License Cancellation | ప్రజలకు హెచ్చరిక..

చట్టపరమైన ఉనికి కోల్పోవడం వల్ల రిజిస్ట్రేషన్లు రద్దయిన వాటిలో మణిభవనం హోమ్ ఫైనాన్స్ ఇండియా ( India ) ప్రైవేట్ లిమిటెడ్, సన్ సోర్స్ లీఫిన్ ప్రైవేట్ లిమిటెడ్, లియనార్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ఉన్నాయి. అలాగే స్వచ్ఛందంగా లైసెన్సులు వెనక్కి ఇచ్చిన వాటిలో అమర్ ప్లాజా అండ్‌ హోల్డింగ్స్, వికోనిక్ వ్యాపార్, సిజిఆర్ మర్కంటైల్ ఫైనాన్స్, బ్రావో క్యాపిటల్ సర్వీసెస్, మనీష్ సింథటిక్స్, రైట్ ట్రీసన్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ వంటి కంపెనీలు ఉన్నాయి.

RBI NBFC License Cancellation | ఆర్బీఐ ముఖ్య గమనిక..

మీరు ఏదైనా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) నుంచి రుణం తీసుకోవాలని భావిస్తే, ఆ సంస్థకు ఆర్బీఐ అధికారిక అనుమతి ఉందా లేదా అని ముందుగా తనిఖీ చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడోచోట తక్కువ వడ్డీ ఇస్తారనో లేదా సులభంగా లోన్ వస్తుందనో నమ్మి ఎలాంటి గుర్తింపు లేని తెలియని ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయించి మోసపోవద్దని ఆర్బీఐ సూచిస్తోంది.

ఇది కూడా చదవండి: Pension Scheme | దేశంలోకెల్లా ఎక్కువ పింఛన్లు ఇస్తున్నది తెలంగాణలోనే..: ప్రభుత్వ సలహాదారు పోచారం

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *