Electric Hair Comb | బట్టతల సమస్యకు చెక్.. ఈ మ్యాజికల్ దువ్వెనతో కేవలం 28 రోజుల్లో కొత్త జుట్టు..!

ప్రస్తుత కాలంలో పురుషుల్లో బట్టతల అనేది ఒక పెద్ద సమస్యగా మారింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Electric Hair Comb | ప్రస్తుత కాలంలో పురుషుల్లో బట్టతల అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ముప్పై ఏళ్లు నిండకముందే జుట్టు రాలిపోవడం, తిరిగి జుట్టు మొలవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో బట్టతల బాధితులకు ఉపశమనం కలిగించేలా చైనా శాస్త్రవేత్తలు ఒక సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించారు. చైనా రాజధాని బీజింగ్‌లోని బెహాంగ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ‘డిటాంగిల్’ (Detangle) పేరుతో ఒక ప్రత్యేక ఎలక్ట్రిక్ దువ్వెనను రూపొందించింది. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ దువ్వెన ఉపయోగించిన కేవలం 28 రోజుల్లోనే జుట్టు పలుచబడిన చోట కొత్త వెంట్రుకలు మొలవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రముఖ ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Electric Hair Comb | ఈ దువ్వెన ఎలా పనిచేస్తుంది?

‘డిటాంగిల్’ ఎలక్ట్రిక్ దువ్వెన చూడటానికి మనం రోజూ వాడే సాధారణ దువ్వెనలాగే ఉంటుంది. అయితే దీనితో తల దువ్వుకున్నప్పుడు తల చర్మానికి అతి సూక్ష్మమైన ఎలక్ట్రిక్ పల్స్‌లు (విద్యుత్ ప్రేరణలు) అందుతాయి. ఈ తేలికపాటి విద్యుత్ సంకేతాలు నిద్రాణస్థితిలో ఉన్న జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచడంతో పాటు, తల చర్మంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి. తద్వారా కొత్త కేశ కుదుళ్లు ఏర్పడి జుట్టు ఒత్తుగా పెరగడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. సాధారణంగా అందుబాటులో ఉన్న ఇతర చికిత్సలతో పోలిస్తే ఈ పరికరం తల చర్మంలోకి 9 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపగలదని పరిశోధకులు స్పష్టం చేశారు.

Electric Hair Comb | 150 కోట్ల మంది బాధితులు..

జన్యుపరమైన , హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే ‘ఆండ్రోజెనెటిక్ అలోపేసియా’ (Androgenetic Alopecia) కారణంగానే మగాళ్లలో ప్రధానంగా బట్టతల వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జుట్టు రాలిపోవడం వల్ల కేవలం బాహ్య రూపమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ దువ్వెన ప్రయోగాలు ఎలుకలపై మాత్రమే విజయవంతమయ్యాయని, త్వరలోనే మనుషులపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  RBI NBFC License Cancellation | ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. ఒక్క దెబ్బతో 63 ఫైనాన్స్ సంస్థల లైసెన్సులు కట్..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *