అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Assembly | తెలంగాణలో రైతులు , పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇళ్లు, స్థలాలు ఎలాంటి ఇబ్బందుల్లో పడకుండా వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని అసెంబ్లీ వేదికగా ఆయన తెలిపారు. మరోవైపు, పేదల ఇళ్లను ఉద్దేశపూర్వకంగా కూల్చివేస్తున్నారంటూ కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై సభలో చర్చిస్తామని వెల్లడించారు.
Revanth Reddy Assembly | ధరణి లొసుగులపై చర్చ..
నిషేధిత భూములు, ప్రభుత్వ భూములు , 22A కేటగిరీకి సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. 22A భూముల వల్ల ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగిస్తామని, వాస్తవాలను సభ ముందుంచుతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వల్ల ధరణి వ్యవహారంలో భారీ స్థాయిలో ఆస్తులు కొందరి చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెడితే రామాయణం అంత ఉంటుందని, చెబితే భారతం అంత పెద్ద కథ అవుతుందని వ్యాఖ్యానించారు. గతంలో తప్పుగా చేర్చిన భూములను పరిశీలించి అర్హులకు త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
Revanth Reddy Assembly | పెరుగుతున్న విద్యుత్ డిమాండ్..
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, దీనివల్ల భవిష్యత్‌లో విద్యుత్ , నీటి వనరుల పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే విద్యుత్ వినియోగం ఏకంగా 19,000 మెగావాట్లకు (MW) పెరిగిందని, ఎల్‌నినో తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. చరిత్ర కొంతమందిని ఎప్పుడూ క్షమించదని, గతంలో జరిగిన తప్పిదాలపై చర్చ జరిగితేనే భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Revanth Reddy Assembly | ప్రతిపక్షంపై విమర్శలు..
విద్యుత్ కొరత రావాలని కొందరు క్షుద్ర పూజలు చేయించారనే అంశంపై సభలో చర్చ జరుగుతుందనే భయంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలు సభ నుంచి పారిపోయారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డను ఎంతో గౌరవిస్తుందని, ఎమ్మెల్యే అయినా లేదా సామాన్య మహిళ అయినా సరే మర్యాదపూర్వకంగానే చూడాలని స్పష్టం చేశారు. కానీ కొంతమంది ప్రతిపక్ష నేతలు వికృతంగా వ్యవహరించారని మండిపడ్డారు.
Revanth Reddy Assembly | అసెంబ్లీ నిబంధనలు..
శాసనసభ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను గత ప్రభుత్వ హయాంలోనే రూపొందించారని సీఎం గుర్తుచేశారు. నినాదాలు లేదా రాజకీయ సందేశాలు ముద్రించిన దుస్తులతో సభకు రావద్దనే నిబంధనకు గతంలో హరీశ్‌రావు మంత్రిగా ఉన్న సమయంలోనే సభ ఆమోదం తెలిపిందని తెలిపారు. పార్లమెంట్లో ఎలాంటి నిబంధనలు ఉంటాయో, అసెంబ్లీలోనూ అవే అమలవుతాయని చెప్పారు. శాసనసభ నిబంధనలను ఉల్లంఘించి, సభా పోడియంలోకి వచ్చి నిరసన తెలిపినప్పటికీ గతంలో సభ్యులను గౌరవించి క్షమించామని, సభలో మాట్లాడేందుకు మైక్ కూడా ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ సభలో కొందరు సభ్యులు, సభ వెలుపల స్పీకర్‌ను సైతం దూషించే పరిస్థితులు సృష్టించారని, అందుకే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. పోలీసు అధికారులు తమ విధులను నిర్వర్తిస్తారని, స్పీకర్ ఆదేశాలను అమలు చేయడమే వారి బాధ్యత అని స్పష్టం చేశారు.
Revanth Reddy Assembly | రేవంత్ రెడ్డి ఆగ్రహం..
మంత్రి శ్రీనివాసరెడ్డిపై కొందరు ప్రతిపక్ష నాయకులు కావాలనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ముక్కుసూటిగా వ్యవహరించే మనిషి కావడంతోనే కొందరికి నచ్చడం లేదని, ఆయనపై ఒక రాజకీయ భూతాన్ని సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో తప్పులకు కారణమైన అంశాలపై సభలో నిర్మాణాత్మక చర్చ జరగాలని, వాటిపై ప్రతిపక్షాలు మంచి సూచనలు ఇస్తే పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
22-A భూములపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిషేధిత భూముల భూతాన్ని సృష్టించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.#Udayam #BreakingNews #RevanthReddy #Ponguleti #22A #Telangana pic.twitter.com/iSUOjOxHF9
— ఉదయం (@udayamdigital) September 16, 2026
ఇది కూడా చదవండి: Bhu Bharati | భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా