Hospital Commission Scam | ఆస్పత్రుల్లో కమీషన్ దందా.. కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు

కామారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్​ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆర్​ఎంపీ, పీఎంపీలకు కమీషన్లు ఇస్తూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి :  Hospital Commission Scam | కామారెడ్డి జిల్లా (Kamareddy District) వ్యాప్తంగా వైద్యం ముసుగులో పెద్ద దందా నడుస్తోంది. పల్లెల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీలే ఈ దందాకు కీలకంగా మారారు. చిన్న జ్వరం, తలనొప్పి, చిన్న గాయాలతో వారి వద్దకు వెళ్లే పేషంట్లను భయపెట్టి కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆ రిఫరల్ వెనుక భారీ కమీషన్ వ్యవహారం నడుస్తోంది.

జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో, ప్రధాన గ్రామాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రైవేట్ ఆసుపత్రుల ఏజెంట్లు నెలవారీ టార్గెట్ ఇస్తున్నారు. ఒక పేషంట్ ను పంపితే 30 శాతం వరకు కమీషన్ ముడుతోందని విశ్వసనీయ సమాచారం. ఉదాహరణకు పేషంట్ బిల్లు రూ.50 వేలు అయితే అందులో రూ.15 వేలు నేరుగా రిఫర్ చేసిన ఆర్ఎంపీకి వెళ్తుంది. కొన్ని ఆసుపత్రులైతే అడ్వాన్స్ గా నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సాధారణ మందులతో తగ్గే జబ్బులకు కూడా స్కానింగ్​లు, ఆపరేషన్లు అవసరం అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

 Hospital Commission Scam | పేషంట్ బిల్లు నుంచే కమీషన్

ఈ మొత్తం కమీషన్ భారం చివరికి పేషంట్ పైనే పడుతోంది. ఆసుపత్రి యాజమాన్యాలు తమ జేబు నుంచి ఇవ్వడం లేదు. పేషంట్ బిల్లులోనే అదనంగా 30 నుంచి 40 శాతం కలిపి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.5 వేలతో అయ్యే పరీక్షకు రూ.8 వేలు, రూ.30 వేలతో అయ్యే డెలివరీకి రూ.50 వేలు ఇలా బిల్లులు పెంచేస్తున్నారు. రోగం తగ్గిన తర్వాత కూడా పేషంట్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. కమీషన్ కోసం కొన్ని చోట్ల అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

Hospital Commission Scam | వైద్యం ముసుగులో వ్యాపారం

కామారెడ్డి పట్టణంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ ప్రాంతాల్లో ఈ దందా మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. పట్టణంలోని 10కి పైగా ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులు ఈ విధంగా ఆర్ఎంపీల నెట్ వర్క్ ను నడుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రతి ఆసుపత్రికి 20 నుంచి 50 మంది ఆర్ఎంపీల నెట్ వర్క్ ఉందని, వారికి ప్రత్యేక కోడ్ నంబర్లు, విజిటింగ్ కార్డులు కూడా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఆర్ఎంపీలు లక్షాధికారులు అవుతుండగా, పేద ప్రజలు మాత్రం ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తోంది. ఈ తతంగం అంతా వైద్యారోగ్య శాఖ అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు.

ఇది కూడా చదవండి..: Nizamabad Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా చర్యలు : కలెక్టర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *