అక్షరటుడే, వెబ్‌డెస్క్: Employee Health Scheme | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) తొలి సమావేశం ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Employee Health Scheme | వారం రోజుల్లో మార్గదర్శకాలు
సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. జులై 15 నుంచి నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు, నిబంధనలను వారం రోజుల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. పథకం అమలుకు అవసరమైన అన్ని ప్రక్రియలను ఈలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Telangana RDO Tahsildar offices | కొత్తగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి రూ. 263.25 కోట్లు మంజూరు
Employee Health Scheme | భార్యాభర్తలు ఉద్యోగులు అయితే..
ఉద్యోగులకు ఆర్థిక భారం తగ్గించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే, వారి నుంచి విడివిడిగా కాకుండా ఒకరి జీతం నుంచి మాత్రమే ఆరోగ్య పథకం చందాను మినహాయించాలని నిర్ణయించారు. గతంలో ఇద్దరి నుంచి చందా మినహాయించిన సందర్భాల్లో, అదనంగా వసూలైన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ఆరోగ్య పథకం అమలులో భాగస్వామ్యమయ్యే ఆసుపత్రుల ఎంపిక, వైద్య సేవల నాణ్యత, చికిత్స ప్యాకేజీలపై సమగ్ర చర్చ జరిపేందుకు వారం రోజుల్లో ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులతో ఆరోగ్య శాఖ అధికారులు, ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
Employee Health Scheme | ప్యాకేజీలు, ఆసుపత్రుల జాబితా..
అలాగే తదుపరి ట్రస్ట్ సమావేశంలో చికిత్సలకు సంబంధించిన ప్యాకేజీ రేట్లు, పథకంలో భాగస్వామ్యం కానున్న ఆసుపత్రుల తుది జాబితాను ఖరారు చేయనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.
ఉద్యోగులకు నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సమావేశంలో అభిప్రాయపడిన సభ్యులు, ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.