అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhagirath Choudhary Subsidy | ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు, ప్రజాప్రతినిధులకు చట్టబద్ధత ఎంత ముఖ్యమో, అంతకంటే మిన్నగా ‘నైతికత’ ముఖ్యం.
కానీ, ప్రస్తుత రాజకీయాల్లో ఆ నైతిక విలువల సరిహద్దులు చెరిగిపోతున్నాయా.. అనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంచలన ఉదంతం.
Bhagirath Choudhary Subsidy | కీరదోస సాగు కోసం
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన పొలంలో కీరదోస సాగు కోసం ఏకంగా రూ. 99.6 లక్షల భారీ సబ్సిడీని పొందారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
ఒక సాధారణ రైతుకు ప్రభుత్వ పథకాలు అందడమే గగనమైపోతున్న నేటి రోజుల్లో.. ఒక కేంద్ర మంత్రికి ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరు కావడం గమనార్హం.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఆయన ఈ సబ్సిడీని పొందింది మరెక్కడి నుంచో కాదు, స్వయంగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని పథకం నుంచే!
Bhagirath Choudhary Subsidy | ప్రయోజనాల ఘర్షణ
ఈ వ్యవహారంలో చట్టపరమైన లోపాలు లేకపోయినా, నైతిక పరంగా పెను ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సదరు సబ్సిడీని ఆమోదించే నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) కమిటీకి కేంద్ర మంత్రి భగీరథ్ చౌదరి ఎక్స్-అఫీషియో వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
అంటే, తాను వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న బోర్డు నుంచే, తన సొంత ప్రాజెక్టుకు నిధులను ఆమోదింపజేసుకోవడం ‘ప్రయోజనాల ఘర్షణ’ (Conflict of Interest) కిందికే వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది దేశవ్యాప్తంగా కేవలం 467 దరఖాస్తులకు మాత్రమే ఈ సబ్సిడీ లభించగా, అందులో మంత్రి గారి దరఖాస్తు కూడా ఉండటం విశేషం.
Bhagirath Choudhary Subsidy | ప్రజాస్వామ్యంలో నైతికత ఎక్కడ?
నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఏ పౌరుడైనా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ అధికార పీఠంపై, అందునా సదరు శాఖకే మంత్రిగా ఉన్న వ్యక్తి, తన సొంత పథకాల ద్వారా లబ్ధి పొందడం ఎంతవరకు సమంజసం?
ఇలాంటి చర్యలు సామాన్య ప్రజల్లో వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని సడలిస్తాయి. “అధికారంలో ఉన్నవారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి” అనే ప్రాథమిక సూత్రానికి ఇది తూట్లు పొడవడమే అవుతుంది.
అంతేకాకుండా, ఈ నివేదిక ప్రకారం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కుటుంబ సభ్యులకు సైతం భారీగా సబ్సిడీలు లభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిధులు, సబ్సిడీలు నిజమైన, నిరుపేద రైతులకు చేరువ కావాల్సింది పోయి.. ఇలా అధికారంలో ఉన్న పెద్దలకు, ఉన్నతాధికారుల కుటుంబాలకే పరిమితమైతే, ఇక సామాన్యుడి సంక్షేమం ఎండమావేనా?
Bhagirath Choudhary Subsidy | వివరణ ఇస్తారా…
చట్టం పరిధిలో అన్నీ సవ్యంగానే జరిగాయని మంత్రులు, అధికారులు సమర్థించుకోవచ్చు. కానీ, ప్రజాక్షేత్రంలో పారదర్శకత, జవాబుదారీతనం చాలా ముఖ్యం. సొంత మంత్రిత్వ శాఖ నుంచే లబ్ధి పొందడం చట్టబద్ధంగా సరైనదే కావచ్చు, కానీ నైతికంగా ఇది ముమ్మాటికీ విమర్శించదగ్గ విషయమే. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, సదరు మంత్రి స్పందించి, ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.