Kavitha Employee Comments | కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం.. ఉద్యోగుల నిర్లక్ష్యంపై కవిత సంచలన వ్యాఖ్యలు

ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మళ్లీ అధికారంలోకి రాలేదని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓడిపోవడం తథ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Employee Comments | ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మళ్లీ అధికారంలోకి రాలేదని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓడిపోవడం తథ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, వారిని చిన్నచూపు చూస్తూ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులను కేవలం ఉద్యోగులుగా కాకుండా, అభివృద్ధిలో భాగస్వాములుగా (డెవలపర్స్) చూస్తామని కవిత స్పష్టం చేశారు. ఉద్యోగులను సంతోషపెట్టేలా, వారికి తగిన గౌరవం ఇచ్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.

Kavitha Employee Comments | ప్రభుత్వ నిర్లక్ష్యం..

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు ఉద్యోగం కంటే ఉద్యమమే ముఖ్యమని భావించి పోరాడారని కవిత గుర్తుచేశారు. రాష్ట్రంలో 630 మండలాలు ఉంటే కేవలం 8 మంది మాత్రమే పర్మనెంట్ ఎంఈవోలు (MEO) ఉండటం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. ఉచిత, నాణ్యమైన విద్య అందించాలంటే పటిష్టమైన పరిపాలన అవసరమని, కానీ అనవసరమైన యాప్‌లు, స్పెషల్ రికగ్నేషన్, రిపోర్ట్‌ల పేరుతో టీచర్లతో పాఠాలు చెప్పకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సింగిల్ టీచర్ స్కూళ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు.

Kavitha Employee Comments | ప్రభుత్వంపై విమర్శల వర్షం..

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లలేదని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కేవలం మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. మైకుల ముందు ఎన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ.. పింఛన్లు సరిగ్గా అందడం లేదని, రైతులకు యూరియా, విద్యుత్ ఇవ్వలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. ఎన్నికల ముందు పీఆర్సీ, డీఏలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Education | నాణ్యమైన విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *