Kamareddy Education | నాణ్యమైన విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Education | విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Kamareddy Education | జిల్లా పరిషత్​ పాఠశాల అభివృద్ధి పనులకు..

జిల్లా పరిషత్ బాలుర పాఠశాల పునర్నిర్మాణ పనులకు రూ. 5 కోట్లతో శంకుస్థాపన, జీవీఎస్ కళాశాల సమీపంలో ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చదువుకున్న పాఠశాలకు జీవం పోసే అవకాశం ఎంతో అదృష్టం చేస్తేనే దక్కుతుందని, ఆ అదృష్టం షబ్బీర్ ఆలీకి దక్కిందన్నారు. నాడు చదువుకునే సమయంలో ఫోన్లు లేవని, ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫోన్లే కనిపిస్తున్నాయని, ఫోన్లను జ్ఞానం కోసమే ఉపయోగించాలన్నారు. విద్యార్థులు చదువుకునే సమయంలో ఫోన్లు వాడొద్దని, ఈ విషయంలో ఉపాధ్యాయులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Kamareddy Education | భవనాలు నాణ్యతతో నిర్మించాలి

నూతనంగా నిర్మించబోయే పాఠశాలను క్వాలిటీతో నిర్మించాలని, ఒక భవనం నిర్మిస్తే దానికి వందేళ్ల చరిత్ర ఉండాలన్నారు. పాఠశాలలు భవిష్యత్తును అందించే దేవాలయాలని, విద్యాలయానికి సమాజాన్ని మార్చే శక్తి ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారని, క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ కిట్ కూడా ఇస్తున్నారని తెలిపారు. 2 వేల మంది విద్యార్థులకు సరిపడా యంగ్ ఇండియా స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు.

Kamareddy Education | అదృష్టంగా భావిస్తున్నా: షబ్బీర్ అలీ

తన విద్యాభ్యాసం ఈ బాలుర పాఠశాలలోనే సాగిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గుర్తు చేసుకున్నారు. ఈ పాఠశాలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. పాఠశాల పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి రూ. 5 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇదే ఆవరణలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ. 10.10 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇటీవల నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో చేపట్టబోయే ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరైందని తెలిపారు. పాఠశాల నిర్మాణం అన్ని హంగులతో చేపట్టాలన్నారు. పాఠశాలలో మైదానం విశాలంగా ఉందని, ఆ మైదానం అలాగే ఉండేలా నిర్మాణం చేపట్టాలన్నారు. పాఠశాల పునర్నిర్మాణం తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం షబ్బీర్ అలీతో పాటు చదువుకున్న స్నేహితులను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఉమారాణి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, డీఎఫ్ఓ నీరజ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ విక్టర్, డీఈఓ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Kamareddy Education | రాష్ట్ర గీతంపై షబ్బీర్ అలీ సీరియస్

ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రాష్ట్ర గీతాన్ని ప్లే చేశారు. ఆ సమయంలో మంత్రితో సహా అందరూ లేచి నిలబడ్డారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్న పాటను అధికారులు ప్లే చేశారు. ముఖ్యమైన వీఐపీలు, మంత్రులు వచ్చినప్పుడు కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న పాట మాత్రమే ప్లే చేయాల్సి ఉండగా 10నిమిషాల నిడివి ఉన్న పాత పాటను ప్లే చేయడం పట్ల కార్యక్రమ నిర్వాహకులపై షబ్బీర్ అలీ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం అప్రూవల్ చేయని పాటను ఎలా ప్లే చేస్తారని, అది కూడా 10 నిమిషాలు ఎలా పెడతారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సిబ్బందికి పాట నిడివిపై సూచనలు చేయాలని పక్కనే ఉన్న కలెక్టర్​కు సూచించారు.

ఇది కూడా చదవండి..: Engineers Day Nizamabad | మోక్షగుండం విశ్వేశ్వరయ్యను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *