అక్షరటుడే వెబ్‌డెస్క్: Mahesh Kumar Goud | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ( Revanth Reddy ), తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదా మనస్పర్థలు లేవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు.
Mahesh Kumar Goud | ఎంతటివారికైనా శిక్షే..
మాజీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం బాధాకరమే అయినప్పటికీ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు. “కాంగ్రెస్‌లో పార్టీ క్రమశిక్షణే అత్యంత ప్రధానం. అధిష్ఠానం నిర్దేశించిన గీత దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. పార్టీలో ఏవైనా సమస్యలు తలెత్తితే అంతర్గత వేదికలపైనే చర్చించుకోవాలి తప్ప, బహిరంగంగా మాట్లాడి క్రమశిక్షణ తప్పితే అధిష్ఠానం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ముఖ్యమంత్రితో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తామంతా ఐకమత్యంగా పని చేస్తున్నామని, వస్తున్న అనవసర ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. పార్టీ కోసం కష్టపడ్డ సామాన్య కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Russia Tariff Bill | ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం.. రష్యా ఆంక్షల బిల్లులో భారత్ పేరు