అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Rakshana Sena | తమ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు గుర్తింపు కల్పించాలని కోరుతూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)కు లేఖ ద్వారా రిప్లై ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో, పార్టీ తరపున ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఈసీకి లేఖ రాశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 28న ఎన్నికల కమిషన్ తమ పార్టీ పేరును కేటాయిస్తూ అంగీకారం తెలిపిందని, ఆ నమ్మకంతోనే తాము రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం చేపట్టామని అనిల్ కుమార్ వివరించారు. అయితే, జూన్ 23న ఈసీ లేఖ రాస్తూ.. తమ పార్టీ రిజిస్ట్రేషన్ విషయంలో సుమారు వెయ్యి అభ్యంతరాలు అందాయని పేర్కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Telangana Rakshana Sena | అభ్యంతరాల కాపీలు ఇవ్వకుండా..
“అభ్యంతరాలు ఎవరి నుంచి వచ్చాయి? వాటిలో ఉన్న ముఖ్యాంశాలు ఏమిటి? అన్న వివరాలు మాకు తెలియదు. అభ్యంతరాల కాపీలే ఇవ్వకుండా, వాటికి సమాధానం ఎలా చెప్పగలం?” అని ఆయన ప్రశ్నించారు. కేవలం వెయ్యి అభ్యంతరాలను సాకుగా చూపి, పార్టీ పేరు మార్చుకోవాలని చెప్పడం తీవ్ర అన్యాయమని, ఇది పార్టీకి భారీ నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Rakshana Sena | పేరులో పోలికలు లేవు..
ప్రతిపాదిత ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరు పూర్తిగా తమ సొంత ఆలోచన అని, ఇది దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీతోనూ పోలి లేదని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ పేరును ఒకే సమగ్ర రూపంగా చూడాలని, విడి పదాలను బట్టి అంచనా వేయడం సరికాదని ఆయన సూచించారు. “తెలంగాణ రక్షణ సమితి”, “తెలంగాణ రాజ్య సమితి” వంటి పేర్లతో తమ పార్టీ పేరుకు ఎటువంటి సంబంధం లేదని, ఉచ్చారణలోనూ, నిర్మాణంలోనూ తమ పేరు విభిన్నంగా ఉందని పేర్కొన్నారు. దేశంలో ఒకే విధమైన పదాలతో వందలాది పార్టీలు రిజిస్టర్ అయ్యాయని, ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, ప్రజా సేవ వంటి పేర్లతో కొనసాగుతున్న పార్టీల జాబితాను కూడా ఈ సందర్భంగా ఆయన ఈసీకి అందజేశారు.
Telangana Rakshana Sena | తగినంత సమయం కావాలి..
వ్యక్తిగత విచారణ కోసం తమను పిలిచే ముందు, పార్టీపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలను, ఆధారాలను తమకు అందజేయాలని అనిల్ కుమార్ కోరారు. ఆ అభ్యంతరాలను పరిశీలించుకుని, తమ వాదనలను బలంగా వినిపించేందుకు తగినంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. కేవలం భౌగోళిక వర్ణనలను బట్టి వచ్చే అభ్యంతరాలను తిరస్కరించాలని, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29A ప్రకారం తమ దరఖాస్తును త్వరగా ఆమోదించాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: Vijayawada Bus Fire | విజయవాడలో అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం