అక్షరటుడే వెబ్‌డెస్క్: Rajiv Yuva Vikas | రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద అర్హులైన యువతకు రూ.1 లక్ష వరకు స్వయం ఉపాధి ఆర్థిక సాయం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ), సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. మంగళవారం ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పనితీరుపై అధికారులతో వారు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబర్ 19 నుంచి ఈ పథకం అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Rajiv Yuva Vikas | ఉపాధి కల్పనే ధ్యేయం..
ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో పేద, బహుజన వర్గాల సంక్షేమం, విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యారంగ అభివృద్ధికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో భాగంగా గురుకుల విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘కేంద్రీకృత వంటశాలల’ (సెంట్రలైజ్డ్ కిచెన్స్) ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గురుకులాల పూర్వ విద్యార్థుల ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం స్టడీ సర్కిళ్ల ద్వారా అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంతో పాటు, ఎస్సీ డిగ్రీ కళాశాలల్లో మారుతున్న మార్కెట్, పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: CP Radhakrishnan | తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరుకానున్న ఉప రాష్ట్రపతి