Ponguleti KCR Affidavit | ఉద్యమకారులకు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల ఆస్తులెలా?: పొంగులేటి ప్రశ్న

ఎన్నికల అఫిడవిట్ల ద్వారా కల్వకుంట్ల కుటుంబం బండారం అడ్డంగా దొరికిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ponguleti KCR Affidavit | ఎన్నికల అఫిడవిట్ల ద్వారా కల్వకుంట్ల కుటుంబం బండారం అడ్డంగా దొరికిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శూన్యం నుంచి వేల కోట్ల విలువైన ఆస్తులకు కేసీఆర్ ఎదిగారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గతంలో 2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని కేసీఆర్ పేర్కొన్నారని, మరి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాలున్న భూస్వామ్య కుటుంబానికి చెందినవారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదనలను మంత్రి ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు.

Ponguleti KCR Affidavit | పొంగులేటి కౌంటర్..

కేసీఆర్ గతంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ పత్రాలను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, ఆ తర్వాత పదేళ్ల అధికార కాలంలో కేసీఆర్ కుటుంబ ఆస్తులు భారీగా పెరిగిన విషయం ఆయన స్వయంగా సమర్పించిన అఫిడవిట్ల ద్వారానే స్పష్టమవుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అప్పులు మిగిలితే, కేసీఆర్ కుటుంబానికి మాత్రం లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా సమకూరాయని నిలదీశారు. ఇదంతా ప్రభుత్వ భూములు, పేదలు, దళితుల అసైన్డ్ భూముల కబ్జా వల్లే సాధ్యమైందని ఆరోపించారు.

Ponguleti KCR Affidavit | కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం..

ఉద్యమకారుల త్యాగాలపై కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టుకుందని పొంగులేటి విమర్శించారు. కానీ, కేటీఆర్ ( KTR) మాత్రం కేసీఆర్‌కు పుట్టుకతోనే వందల ఎకరాలున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లలో తప్పుగా రాసి ప్రజలను మోసం చేశారా? లేక ఇప్పుడు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారా? అని కేటీఆర్‌ను ఆయన నిలదీశారు.

ఇది కూడా చదవండి:  Narendra Modi Birthday | నవ భారత నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *