అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana High Court | సిద్దిపేట జిల్లా ( Siddipet ) ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో జరిగిన ‘పసుపు నీళ్ల’ వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయవద్దని పోలీసులను స్పష్టంగా ఆదేశించింది. ఎలాంటి ముందస్తు అరెస్టులకు పాల్పడకుండా, కేవలం చట్టపరమైన నోటీసులు జారీ చేసి మాత్రమే దర్యాప్తు ముందుకు తీసుకెళ్లాలని సూచించింది.
Telangana High Court | దుమారం రేపిన ఘటన..
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పసుపు నీళ్లతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ నేతలు, స్థానికుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కొందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Telangana High Court | పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం..
కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో.. వారు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పుడు నిందితులను ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారని ఘాటుగా ప్రశ్నించింది.
ఈ తరహా కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా తొందరపడి అరెస్టులు చేయడం సరికాదని మందలించింది. నిందితులకు కేవలం సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి, చట్టప్రకారమే విచారణ జరపాలని ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Nirmala Sitharaman | దేశ ప్రయోజనాలే ప్రథమం.. జెన్-జెడ్, జెన్ ఆల్ఫా యువతకు నిర్మలా సీతారామన్ పిలుపు