Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి చేయాలనే ‘సత్సంకల్పం’తో ఉన్న క్రీడా శాఖ (SPORTS AUTHORITY OF TELANGANA), తాజాగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

ఎక్కడో మారుమూల గ్రామాల్లో సరైన మైదానాలు లేక, కనీస సదుపాయాలు కరువై అల్లాడుతున్న క్రీడాకారులను పక్కనబెట్టి… అత్యంత ‘పేదరికంలో’ మగ్గిపోతున్న మన మంత్రుల కోసం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ హౌస్‌లో ఏకంగా రూ. 2.63 కోట్లతో ఒక బ్రహ్మాండమైన స్విమ్మింగ్ పూల్ నిర్మించేందుకు టెండర్లు పిలిచింది.

ఈ వార్త చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. “తెలంగాణకు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం లేదు” అని బాధపడే క్రీడాభిమానులకు ఈ నిర్ణయంతో ఒక పెద్ద క్లారిటీ వచ్చేసింది.

అసలైన క్రీడా ఆణిముత్యాలు మన సెక్రటేరియట్ లోనూ, మినిస్టర్ క్వార్టర్స్ లోనూ ఉన్నారని సర్కారు గుర్తించినట్టుంది!

akshara today .jpgpool

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌కు వెళ్లే ‘సరికొత్త’ అథ్లెట్లు ఎవరు?

సాధారణంగా ఒలింపిక్స్, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు పేద, మధ్యతరగతి క్రీడాకారులు పగలు, రాత్రి కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వారి కంటే ముందు చూపుతో ఆలోచించింది.

రూ. 2.63 కోట్ల ప్రజాధనంతో నిర్మించే ఈ స్విమ్మింగ్ పూల్‌లో (బేబీ పూల్‌తో సహా) మన మంత్రులు సరికొత్త ఈత దుస్తులు ధరించి, పగడపు దీవుల్లో మునిగినట్లు మునకలు వేస్తూ కఠినమైన శిక్షణ తీసుకోబోతున్నారు.

రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో ‘బటర్‌ఫ్లై’ స్ట్రోక్ వేసి తెలంగాణకు ఏ మినిస్టర్ గోల్డ్ మెడల్ తెస్తారో.. ‘బ్యాక్ స్ట్రోక్’ లో ఎవరు రికార్డు సృష్టిస్తారో.. చూడాలని ప్రజలు ఈ శతాబ్దపు అతిపెద్ద ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

బహుశా ఫైళ్ల మీద సంతకాలు పెట్టి అలసిపోయిన చేతులకు, ఈత కొట్టడం ద్వారా మంచి ఉపశమనం దొరుకుతుందని స్పోర్ట్స్ అథారిటీ భావించి ఉండొచ్చు!

 

Untitled 1.jpgTG sport
Minister Quarters Swimming Pool

Minister Quarters Swimming Pool | ఒకవైపు మొసలి కన్నీరు.. మరోవైపు దుబారా ఖర్చులు!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అప్పు పుట్టడం లేదని, గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని రోజూ మైకుల ముందుకొచ్చి పాలకులంతా మొసలి కన్నీరు కారుస్తుంటారు.

జీతాలు ఇవ్వడానికి, పథకాలు అమలు చేయడానికి పైసలు లేవంటూనే.. మంత్రుల విలాసాల కోసం కోట్లాది రూపాయలు నీళ్లలా పారించడం ఏ రకమైన ‘ఆర్థిక క్రమశిక్షణో’ అర్థం కావడం లేదని మేధావులు విమర్శిస్తున్నారు.

Minister Quarters Swimming Pool | ప్రజల సూటి ప్రశ్న

“తెలంగాణలోని ఎందరో ప్రతిభావంతులైన క్రీడాకారులు స్విమ్మింగ్ పూల్స్ లేక చెరువుల్లో, బావుల్లో ప్రాక్టీస్ చేస్తూ ప్రాణాలు కోల్పోతుంటే.. ఆ నిధులను జిల్లాల్లోని స్పోర్ట్స్ అకాడమీలకు కేటాయించాల్సింది పోయి, ఏసీ గదుల్లో ఉండే మంత్రుల కోసం ఈ రేంజ్ లో దుబారా ఖర్చులు చేయడం ఏందయ్యా..?” అని సామాన్య జనం ఈసడించుకుంటున్నారు.

ఏది ఏమైనా.. “ప్రజా పాలన” అంటే ప్రజల సొమ్ముతో పాలకుల విలాసాలు కాదనే కనీస జ్ఞానాన్ని ఈ ‘స్పోర్ట్స్ అథారిటీ’ వారు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి!

Japan Mango Export Ban | పాలకుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం…..

Swathi Reddy | పెళ్ళి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్…..

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *