అక్షరటుడే వెబ్‌డెస్క్: Nirmala Sitharaman | “దేశం మనకేం చేసిందనే దానికంటే.. దేశం కోసం మనం ఏం చేయగలమనేది ఆలోచించండి” అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యువతకు పిలుపునిచ్చారు. మంగళవారం చెన్నైలోని ( Chennai )డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జెన్ జెడ్ (Gen Z), జెన్ ఆల్ఫా (Gen Alpha) తరాలకు చెందిన యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టి, దేశ ప్రయోజనాలకే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మీరు మిమ్మల్ని ఏ తరంగా పిలుచుకున్నా సరే.. మీ చుట్టూ ఏం జరుగుతోంది? దేశ అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటి? మీ ద్వారా దేశానికి ఏది సాధించవచ్చు అనే అంశాలపై యువత తప్పక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
Nirmala Sitharaman | దేశ ప్రగతిలో యువతే కీలకం..
పట్టభద్రులవుతున్న విద్యార్థులు తమ రంగాల్లో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని కోరారు. దేశం సురక్షితంగా, బలంగా ఉన్నప్పుడే మనకంటూ ఒక ఇల్లు ఉంటుందని, దేశాన్ని ఎప్పటికీ విస్మరించకూడదని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీనాయకత్వంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటుతో స్థిరంగా దూసుకెళ్తోందని తెలిపారు.
తమిళనాడులోని పారిశ్రామిక అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. శ్రీపెరంబుదూర్-ఒరగడం కారిడార్ నేడు ఆటోమొబైల్, స్మార్ట్‌ఫోన్ ఎగుమతులకు గ్లోబల్ హబ్‌గా మారిందని చెప్పారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (GCC) దాదాపు 10 శాతం (350 కేంద్రాలు) ఒక్క తమిళనాడులోనే ఉన్నాయని వెల్లడించారు.
Nirmala Sitharaman | మహిళా సాధికారతకు పెద్దపీట..
మహిళలు ఉద్యోగ రంగాల్లో రాణించేందుకు వీలుగా.. STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విద్యనభ్యసించిన వారి కోసం ప్రతి జిల్లాలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. చివరిగా తిరుక్కురళ్ లోని పద్యాలను ఉదహరిస్తూ.. యువత ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా అహంకారాన్ని దరిచేరనీయకూడదని, వినయం, సహనంతో ముందుకు సాగుతూ సవాళ్లను ఎదుర్కోవాలని నూతన పట్టభద్రులకు హితవు చెప్పారు.
ఇది కూడా చదవండి: Nizamabad Medical Jobs | ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం