అక్షరటుడే వెబ్‌డెస్క్: Polala Amavasya | భారతీయ సనాతన సంప్రదాయంలో పండుగలు, వ్రతాలు కేవలం పూజాదికాలకే పరిమితం కాకుండా ప్రకృతితో మమేకమై జీవించాలనే గొప్ప సందేశాన్ని ఇస్తాయి. అందులో శ్రావణ మాస బహుళ పక్ష అమావాస్య రోజున ఆచరించే ‘పోలాల అమావాస్య’కు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11న మహిళలు ఈ పూజను నిర్వహించనున్నారు. ముఖ్యంగా సంతాన సౌభాగ్యం కోరుకునే వివాహిత స్త్రీలు, ఆడపిల్లల సంతాన ప్రాప్తిని కోరుకునే దంపతులు ఈ వ్రతాన్ని అత్యంత నిష్టతో ఆచరించాలని పెద్దల సూచన. శివపురాణం, నారదపురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరిస్తే వంశాభివృద్ధి, సత్సంతానం కలుగుతాయని భక్తుల నమ్మకం.
Polala Amavasya | కంద మొక్క పూజ..
హిందూ సంప్రదాయంలో సాధారణంగా దేవుళ్ల విగ్రహాలు లేదా ఫొటోలను పూజిస్తారు. కానీ, పోలాల అమావాస్య రోజున మాత్రం ప్రత్యక్ష ప్రకృతే దైవంగా భావించి ‘కంద మొక్క’ను పూజించడం విశేషం. పూజలో భాగంగా ముందుగా విఘ్నేశుడిని ( Lord Ganesha )ఆరాధించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని ఆవాహన చేస్తారు. ఆ మొక్కకు తొమ్మిది పసుపు కొమ్ములను రక్షణగా కడతారు. అమ్మవారి రూపంగా భావించే ఆ మొక్కకు షోడశోపచార పూజలు చేసి, పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తారు.
వ్రతం పూర్తయిన తర్వాత ఆ కంద మొక్కను పవిత్రంగా చూసుకుంటారు. మరుసటి రోజు దానిని ఇంట్లో లేదా పూల కుండీలో నాటి నిత్యం నీరు పోసి సంరక్షిస్తారు. కొద్దిరోజుల్లో ఆ మొక్క చుట్టూ కొత్త పిలకలు రావడం గృహంలో సంతానవృద్ధికి, శుభాలకు సంకేతంగా భావిస్తారు.
Polala Amavasya | పురాణ గాథ..
ఈ పర్వదినం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. గతంలో ఓ బ్రాహ్మణ మహిళకు పుట్టిన బిడ్డలు పుట్టినట్లే మరణిస్తుండటంతో తీవ్ర దుఃఖానికి లోనైన ఆ తల్లి, గ్రామ పొలిమేరల్లోని పోలమ్మ తల్లి చెంతనే పిల్లలను ఖననం చేసేది. ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య నాడే పిల్లలు మరణిస్తుండటంతో ఆమె ఎనాడూ నోము నోచుకోలేదు. తన పూర్వజన్మ పాపమే ఈ దుస్థితికి కారణమని ఆవేదన చెందుతున్న తరుణంలో పోలమ్మ తల్లి ప్రత్యక్షమై అసలు నిజం చెబుతుంది.
గత జన్మలో పోలాల అమావాస్య రోజున పేరంటాళ్లు రాకముందే, పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారనే భావనతో ఎవరూ చూడకుండా వంటకాలను రుచి చూసి ఆచార నియమాలను ఉల్లంఘించావని తల్లి తెలియజేస్తుంది. తన తప్పును గ్రహించిన ఆ బ్రాహ్మణ స్త్రీ పశ్చాత్తాపంతో పోలాల అమావాస్య వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించి, అమ్మవారి కరుణతో తిరిగి తన సంతానాన్ని క్షేమంగా పొందిందని పురాణాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nizamabad Water Resources | నీటి వనరులు వృథా కాకుండా చూడాలి..