అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Housing DEE Suspended | డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తనిఖీల వివరాలను ఓ అధికారి లీక్ చేశాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిపై వేటు వేశారు.
గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన విషయం తెలిసిందే. వాటిని పలువురికి కేటాయించారు. అయితే డబుల్ ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం నేరం. అలా చేస్తే వారి నుంచి ఇల్లు స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం గతంలోనే తెలిపింది. ఈ క్రమంలో తాజాగా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ (Hyderabad)లో డీఈఈగా పనిచేస్తున్న చంద్రపాల్, ఇళ్లలో అసలైన లబ్ధిదారులు నివసిస్తున్నారా లేదా అని ధృవీకరించడానికి ఉద్దేశించిన తనిఖీల వివరాలను లీక్ చేశారు. దీంతో హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం ఆయనను సస్పెండ్ చేశారు.
Housing DEE Suspended | అర్హులే ఉండాలి
బలహీన వర్గాల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లను అద్దెకు ఇవ్వడం లేదా అమ్మడం, లేదా కేటాయింపుదారులకు బదులుగా ఇతరులను నివసించడానికి అనుమతించడం వంటివి పథకం నిబంధనల ఉల్లంఘనలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అక్రమ కేటాయింపులను గుర్తించి, రద్దుతో సహా చర్యలు తీసుకోవడానికి అధికారులు నోటీసులు జారీ చేస్తూ, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొల్లూరులోని 2 బీహెచ్‌కే ఇళ్లు మంజూరైన వారు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు గతంలో తనిఖీలు చేసి నోటీసులు జారీ చేశారు. దీంతో పలువురు లబ్ధిదారులు తాము ఆ ఇంట్లోనే ఉంటున్నామని నోటీసులకు వివరణ ఇచ్చారు.
Housing DEE Suspended | ఆకస్మిక తనిఖీలతో..
లబ్ధిదారులు ఆయా నివాసాల్లో ఉంటున్నారో తెలుసుకోవడానికి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం పూట తనిఖీలకు ప్రణాళిక రూపొందించారు. అయితే అధికారులు చెకింగ్‌కు వస్తున్నారనే విషయాన్ని డీఈఈ చంద్రపాల్ ముందుగానే లబ్ధిదారులకు లీక్ చేశాడు. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. తనిఖీ వివరాలు లీక్ అయినట్లు నిర్ధారించారు. దీంతో చంద్రపాల్‌ను సస్పెండ్ చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశించారు. తనిఖీలు కొనసాగుతాయని, 2 బీహెచ్‌కే ఇళ్లలో లబ్ధిదారులు నివాసం ఉండకుంటే వాటిని రద్దు చేస్తామన్నారు.
దీనిని కూడా చదవండి : Maoist Dump Seized | కర్రెగుట్టల్లో మావోయిస్ట్ డంప్ స్వాధీనం