అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jensen Huang Nvidia CEO | అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) చరిత్రలో కనీవినీ ఎరుగని నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదాల కారణంగా సీఈవో పదవికి రాజీనామా చేసిన సంస్థ సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ను (Jensen Huang) తిరిగి అదే పదవిలో నియమిస్తున్నట్లు ఎన్విడియా బోర్డు సోమవారం సంచలన ప్రకటన చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ ఇన్వెస్టర్లు, ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాల ఒత్తిడికి తలొగ్గిన బోర్డు, గత వారం తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేసింది.
Jensen Huang Nvidia CEO | అసలేం జరిగింది?
చైనాకు గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళతో పాటు, సంస్థలోని ఇద్దరు ఉద్యోగులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారన్న వార్తలు బయటకు రావడంతో నవంబర్ 12న జెన్సన్ హువాంగ్ తన సీఈవో పదవికి రాజీనామా చేశారు.
ఈ పరిణామం ప్రపంచ ఏఐ (AI) మార్కెట్‌ను కుదిపేసింది. అప్పట్లో ఎన్విడియా ఛైర్మన్ హార్వే జోన్స్ స్పందిస్తూ.. సంస్థ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన హువాంగ్ను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా, సీఎఫ్ఓ కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించారు.
అయితే, హువాంగ్ నిష్క్రమణతో టెక్ రంగంలో మొదలైన అలజడి సిలికాన్ వ్యాలీ నుంచి వాషింగ్టన్ వరకు ప్రకంపనలు సృష్టించింది. ఆయన్ను తిరిగి సీఈవోగా నియమించాలంటూ ఆన్లైన్లో మొదలైన పిటిషన్‌పై టెస్లా అధినేత ఎలన్ మస్క్ సహా 1.80 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హువాంగ్ను వెనక్కి తీసుకురావాలని ఎన్విడియా బోర్డుకు సూచించారు.
Jensen Huang Nvidia CEO | బోర్డు యూ-టర్న్
అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం మేరకు, హువాంగ్ తిరిగి రావడం వల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ఎన్విడియా బోర్డు నిర్ధారించుకుంది. ఆయన నాయకత్వ సామర్థ్యంపై పూర్తి విశ్వాసంతో తక్షణమే సీఈవోగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ Trump తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. “ఇది అత్యంత సరైన, సముచితమైన నిర్ణయం. హువాంగ్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.
అయితే, అమెరికా ఎగుమతి నిబంధనల విషయంలో ఎన్విడియా తన అంతర్గత విచారణను కొనసాగించాలి” అని ట్రంప్ పేర్కొన్నారు. అటు ఎలన్ మస్క్ సైతం ‘ఎక్స్’ (X) వేదికగా “ఇది జరిగిపోయింది” (It is done) అంటూ తన మద్దతును చాటుకున్నారు.
Jensen Huang Nvidia CEO | మార్కెట్లలో సునామీ..
హువాంగ్ రీ-ఎంట్రీ వార్త వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లో ఎన్విడియా షేర్లు ఏకంగా 33 శాతం మేర దూసుకెళ్లాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కసారిగా సుమారు 900 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం.
“ఒక కొత్త పారిశ్రామిక విప్లవం ప్రారంభమవుతున్న తరుణంలో, ప్రపంచంలోని అత్యంత కీలకమైన టెక్ కంపెనీని తిరిగి నడిపించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను” అని 63 ఏళ్ల జెన్సన్ హువాం ఒక ప్రకటనలో తెలిపారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Jensen Huang Nvidia CEO | సవాళ్లు, విచారణలు ఇంకా మిగిలే ఉన్నాయి..
సీఈవోగా తిరిగి పగ్గాలు చేపట్టినప్పటికీ, హువాంగ్ ముందున్న సవాళ్లు అంత సాధారణమైనవి కావు. ఒకవైపు అకౌంటింగ్ అవకతవకలు, చిప్ స్మగ్లింగ్ ఆరోపణలపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC), న్యాయ శాఖ విచారణ జరుపుతున్నాయి.
మరోవైపు, విదేశీ నిఘా సంస్థలు హువాంగ్ను లక్ష్యంగా చేసుకున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేసేందుకు ఎన్విడియా బోర్డు ఒక ప్రత్యేక కమిటీని వేసింది. చైనాకు అధునాతన ఏఐ చిప్‌ల సరఫరా విషయంలో అమెరికా చట్టసభ సభ్యుల ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది.
ఏదేమైనా, వీడియో గేమ్ చిప్‌ల తయారీ స్థాయి నుంచి ప్రపంచ ఏఐ సామ్రాజ్యానికి రారాజుగా ఎన్విడియాను తీర్చిదిద్దిన జెన్సన్ హువాంగ్.. “తొలగించలేనంత శక్తిమంతుడైన నాయకుడు” (Too big to be fired) అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.