అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mercury face cream kidney | సోషల్ మీడియాలో కనిపించే రంగుల ప్రకటనలు, ఇన్ఫ్లుయెన్సర్ల మాయమాటలను గుడ్డిగా నమ్మితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని నిరూపించే షాకింగ్ ఘటన కేరళలో వెలుగుచూసింది.
అందంగా కనిపించాలనే ఆశతో ఇన్స్టాగ్రామ్ ప్రకటన చూసి కొనుగోలు చేసిన ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్, 17 ఏళ్ల బాలిక కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీసింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mercury face cream kidney | అసలేం జరిగింది?
కేరళలోని మలప్పురం జిల్లా, అరీకోడ్ సమీపంలోని ఉగ్రపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన ప్రమోషన్లను చూసి ‘ఎఫ్ ట్యూన్’ (F Tune) అనే ఫేస్ క్రీమ్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. మొటిమలు, మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుందని ఆశించి కొన్ని రోజుల పాటు దానిని క్రమం తప్పకుండా వాడింది.
Mercury face cream kidney | ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజం
క్రీమ్ వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజులకే ఆ బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. కాళ్లు వాచిపోవడం, కళ్లు తిరగడం, రక్తపోటు (BP) పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఆమెకు ‘మెంబ్రనస్ నెఫ్రోపతి’ (Membranous Nephropathy) అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధి సోకినట్లు తేలింది.
ఆమె వాడిన ‘ఎఫ్ ట్యూన్’ క్రీమ్ నమూనాను కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పరీక్షించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ క్రీమ్‌లో మనుషులకు అత్యంత హాని చేసే మెర్క్యురీ (పాదరసం) ఏకంగా 1.25% మేర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
చర్మం skin ద్వారా శరీరంలోకి ప్రవేశించిన ఈ విషపూరిత మెర్క్యురీ, నేరుగా ఆమె కిడ్నీలను దెబ్బతీసినట్లు స్పష్టమైంది. ఇప్పటికే ఆమె చికిత్స కోసం కుటుంబ సభ్యులు సుమారు రూ. లక్ష వరకు ఖర్చు చేశారు.
Mercury face cream kidney | రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు
బాధితురాలి ఫిర్యాదు మేరకు అరీకోడ్ పోలీసులు ‘ఎఫ్ ట్యూన్’ క్రీమ్ తయారీదారులపై భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు, గతంలో తాను కూడా ఇలాంటి ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడటం వల్లే కిడ్నీ సమస్యల బారిన పడ్డానని ప్రముఖ మలయాళ గాయకుడు సలీం కోడత్తూర్ వెల్లడించడం గమనార్హం.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం, ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న నకిలీ సౌందర్య ఉత్పత్తులపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. సోషల్ మీడియా ప్రకటనలు చూసి వైద్యుల సలహా లేకుండా క్రీమ్‌లు వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..