అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Development | ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని.. నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
Yellareddy Development | నియోజకవర్గంలో..
నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు, పరిపాలనా అనుమతులు ఇవ్వాలని సీఎంను ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు ఆర్థిక ఆమోదం లభించిన నేపథ్యంలో వెంటనే క్యాబినెట్ ఆమోదం కల్పించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటు చేయడంతో పాటు, రూ.6 కోట్ల వ్యయంతో నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో నూతన ఎంపీడీవో కార్యాలయ భవనాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. గాంధారి మండలంలోని బాన్సువాడ–ఉప్పల్‌వాయి రహదారిపై హైలెవల్ బ్రిడ్జిల పునర్నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Yellareddy Development | విద్యారంగ అభివృద్ధికి..
విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, అవసరమైన అనుమతులు, నిధుల మంజూరుకు సకాలంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డ్ నిధులు విడుదల చేసినందుకు సీఎంకు ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రవాణా, విద్య, పరిపాలన, సాగునీటి రంగాల్లో మరింత అభివృద్ధికి అవకాశం కలగనుంది.
ఇది కూడా చదవండి..: Land Resurvey | సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే: కలెక్టర్ ఇలా త్రిపాఠి