అక్షరటుడే వెబ్‌డెస్క్: Rolls Royce IIT Kanpur | ఇంజిన్ వైబ్రేషన్‌కు సంబంధించిన శబ్దంపై (Engine Vibration Related Noise) దృష్టి సారించే ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టును రోల్స్-రాయిస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IIT Kanpur) ప్రకటించాయి. నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ అభయ్ కరండికర్, ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్, రోల్స్-రాయిస్ రోటర్ డైనమిక్స్ అసోసియేట్ ఫెలో ఆండీ రిక్స్, ఫ్యూచర్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ మేనేజర్ రాఘవేంద్ర సరూర్ర్తో పాటు సీనియర్ అధ్యాపకులు, ప్రతినిధుల సమక్షంలో ఐఐటీ కాన్పూర్‌లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రారంభంలో రోల్స్-రాయిస్ ఇండియా, ఐఐటీ కాన్పూర్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ఆధారంగా ఈ పరిశోధనను చేపట్టారు. పరిశోధనలు, ఉమ్మడి ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది.
Rolls Royce IIT Kanpur | క్యాబిన్ శబ్దం తగ్గింపు లక్ష్యం..
ట్రెంట్ ఎక్స్‌డబ్ల్యూబీ (Trent XWB) వంటి రోల్స్-రాయిస్ ఇంజిన్లు అధునాతన సాంకేతికత, తక్కువ శబ్ద లక్షణాలతో విమాన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, భద్రతను అందిస్తాయి. తాజా ప్రాజెక్టు ద్వారా ఇంజిన్ వైబ్రేషన్ల ప్రభావాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుని, విమాన క్యాబిన్లో శబ్దాన్ని తగ్గించే మార్గాలను పరిశోధిస్తారు.
Rolls Royce IIT Kanpur | సంస్థల ప్రతినిధుల స్పందన..
విద్యా సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలు, కొత్త తరం ప్రతిభను ప్రోత్సహించే చరిత్ర రోల్స్-రాయిస్‌కు ఉందని రోల్స్-రాయిస్ ఇండియా ( India ) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శశి ముకుందన్ తెలిపారు. అధునాతన ఇంజనీరింగ్, పరిశోధన, తయారీ రంగాల్లో భారత లక్ష్యాలకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని, వాస్తవ సవాళ్లను పరిష్కరించే అనుభవాన్ని విద్యార్థులకు అందిస్తుందని పేర్కొన్నారు.
సంఖ్యాపరమైన పద్ధతులు, ప్రయోగాత్మక ధ్రువీకరణ కలయికతో విమాన క్యాబిన్ సౌకర్యానికి సంబంధించిన కీలక అంశాన్ని పరిశీలించే అవకాశం ఈ ప్రాజెక్టు ఇస్తోందని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అన్నారు. ఐఐటీ కాన్పూర్‌లో ప్రయోగాత్మక టెస్ట్ రిగ్ ఏర్పాటు చేసి వైబ్రేషన్ ప్రసారం, శబ్ద తగ్గింపు వ్యూహాలపై విశ్వసనీయ సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. ఐఐటీ కాన్పూర్ డీప్-టెక్ వ్యవస్థను బలోపేతం చేసే దిశలో ఇది కీలక అడుగు అని చెప్పారు.
Rolls Royce IIT Kanpur | ఆరు నెలల పరిశోధన..
ఆరు నెలల పాటు సాగే ఈ పరిశోధన ప్రధానంగా విమాన క్యాబిన్ సౌకర్యంలో కీలకమైన ఇంజిన్ వైబ్రేషన్ల వల్ల కలిగే శబ్దంపై దృష్టి పెడుతుంది. రోల్స్-రాయిస్ రూపొందించిన సంఖ్యాపరమైన పద్ధతిని ఐఐటీ కాన్పూర్‌లోని ప్రయోగాత్మక టెస్ట్ రిగ్ ద్వారా ధ్రువీకరిస్తారు. ఇంజిన్‌ను సూచించే వైబ్రేషన్ మూలంతో విమానం గాలిలో ఎగురుతున్న పరిస్థితులను పోలిన ప్రయోగాత్మక విమాన ఫ్యూజ్‌లేజ్ నమూనాను రూపొందించారు. ఆధునిక ధ్వని, వైబ్రేషన్ సెన్సార్ల సాయంతో వీటి పనితీరును సమగ్రంగా పరిశీలిస్తారు. భవిష్యత్తులో శబ్ద తగ్గింపు పరిశోధనలకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయి. తొలి దశగా (Phase 1) ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు తదుపరి దశలు ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Chakratheertham Festival | భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం.. లింబాద్రిగుట్టపై ఆధ్యాత్మిక శోభ