అక్షరటుడే, వెబ్డెస్క్ : AIADMK Factionalism | తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు అగ్రశ్రేణి శక్తిగా ఉన్న AIADMK ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) పార్టీ కేవలం 47 సీట్లకే పరిమితమై మూడో స్థానానికి పడిపోవడంతో నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా పార్టీ భవిష్యత్తును ఎవరు నడిపిస్తారు? అనే అంశంపై ఇప్పుడు అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి (Edappadi K. Palaniswami) తన నివాసంలో శనివారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు భవిష్యత్ వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ భేటీ ముగిసిన వెంటనే చెన్నైలోని సీవీ షణ్ముగం నివాసంలో మరో ప్రత్యేక సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
AIADMK Factionalism | పళనిస్వామి నాయకత్వానికే మద్దతు ..
ఈ సమావేశానికి సుమారు 37 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో పార్టీలో వర్గపోరు స్పష్టంగా బయటపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు ముందుగా పళనిస్వామిని కలిసి, ఆ తర్వాత షణ్ముగం ఇంటికి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. షణ్ముగం వర్గంలో ఎస్పీ వేలుమణి, సీ విజయభాస్కర్, కేసీ వీరమణి వంటి కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు, పళనిస్వామి నిర్వహించిన సమావేశానికి 16 మంది జిల్లా కార్యదర్శులు హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన మొత్తం 47 మంది ఎమ్మెల్యేలలో ఎవరికి ఎంతమంది మద్దతు ఉందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
AIADMK Factionalism | ‘రెండాకుల’ గుర్తుకు మళ్లీ పూర్వ వైభవం
ఈ రాజకీయ పరిణామాలపై మీడియా ప్రశ్నించగా సీవీ షణ్ముగం “చూస్తూ ఉండండి” అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో పార్టీలో మరిన్ని కీలక మార్పులు జరిగే అవకాశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా, మాజీ ఎమ్మెల్యే మణిమేఖలై మాత్రం బహిరంగంగా పళనిస్వామికి మద్దతు ప్రకటించారు. పార్టీని నడిపించే సామర్థ్యం ఈపీఎస్‌కే ఉందని ఆమె స్పష్టం చేశారు. భారీ మెజారిటీతో గెలిచిన నాయకుడిగా ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అలాగే ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను పార్టీ సమగ్రంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సరైన వ్యూహాలతో ముందుకెళ్తే పార్టీకి చెందిన ‘రెండాకుల’ గుర్తుకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. AIADMKలో రాబోయే రోజుల్లో మరింత రాజకీయ వేడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాయకత్వంపై తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi | మోదీకి దేశాన్ని నడపడం చేతకాదు.. రాహుల్ గాంధీ విమర్శలు

