Nagarjuna T Shirts | నాగార్జున ఫొటోలతో టీ-షర్టుల విక్రయం.. ఢిల్లీ హైకోర్టు సీరియస్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nagarjuna T Shirts | ప్రముఖ సినీ నటుడు నాగార్జున వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలను ఉపయోగిస్తూ టీ-షర్టులను విక్రయిస్తున్న ఓ వ్యాపారిపై నాగార్జున కోర్టును ఆశ్రయించగా, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ తుషార్ రావు గెడెలా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

విచారణ సందర్భంగా సదరు వ్యాపారిని ఉద్దేశించి కోర్టు “నాగార్జున ఫొటోలను వాణిజ్యపరంగా ఉపయోగించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అంటూ ప్రశ్నించింది. దీనికి వ్యాపారి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమాకు తమ సంస్థ అధికారిక మర్చండైజింగ్ భాగస్వామిగా పనిచేసిందని తెలిపారు. ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా సినిమా నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరిందని, ఆ ఉత్పత్తులను నాగార్జున స్వయంగా కూడా ప్రచారం చేశారని వాదించారు.

Nagarjuna T Shirts | హ‌క్కు మీకెక్క‌డిది..

అయితే, విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. నాగార్జునతో గానీ, సినిమా నిర్మాణ సంస్థతో గానీ తమకు ప్రత్యక్ష ఒప్పందం లేదని వ్యాపారి తరఫు న్యాయవాది అంగీకరించారు. దీంతో కోర్టు మరింత తీవ్రంగా స్పందించింది. “ప్రత్యక్ష ఒప్పందమే లేదని మీరే చెబుతున్నప్పుడు, ఈ ఉత్పత్తులను విక్రయించే చట్టబద్ధమైన హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది?” అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వ్యాపారి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. సంబంధిత ఒప్పంద పత్రాలు, ఇతర ఆధారాలను సమర్పించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

Nagarjuna T Shirts | ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఇక ఈ కేసులో గతేడాది సెప్టెంబర్‌లోనే నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖుల పేరు, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం చట్టపరంగా ఎంతవరకు సమంజసం అనే అంశంపై ఈ కేసు ఇప్పుడు సినీ, వ్యాపార వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఇది కూడా చదవండి..: Single Screen Theatres | పర్సంటేజీ విధానంతోనే సింగిల్​ స్క్రీన్​ థియేటర్ల మనుగడ : ఎగ్జిబిటర్స్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *