SRH Playoffs Scenario | గుజరాత్‌పై చిత్తుగా ఓడిన ఎస్ఆర్‌హెచ్.. హైద‌రాబాద్ జ‌ట్టుకి ప్లేఆఫ్స్ చేరుకోవ‌డం క‌త్తి మీద సామే..!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SRH Playoffs Scenario | గుజ‌రాత్ టైటాన్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.

మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. గుజరాత్ (Gujarat Titans) బౌలర్ల దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా కొనసాగుతుండగా, ఈ పరాజయం ఎస్ఆర్‌హెచ్‌కు భారీ దెబ్బగా మారింది.

SRH Playoffs Scenario | గుజ‌రాత్ బెర్త్ దాదాపు ఖాయం..

మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ విజయంతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ సీజన్‌లో తొలిసారిగా 16 పాయింట్ల మార్క్‌ను అందుకున్న జట్టుగా గుజరాత్ నిలిచింది. సాధారణంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే 16 పాయింట్లు కీలకంగా భావిస్తారు. దీంతో గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఇక ఇటీవల ఆర్సీబీ (Royal Challengers Bengaluru) టాప్‌లో నిలిచిన‌, ఇప్పుడు గుజరాత్ విజయంతో రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆర్సీబీ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

SRH Playoffs Scenario | అత్యంత క్లిష్టంగా ఎస్ఆర్‌హెచ్ పరిస్థితి

ఎస్ఆర్‌హెచ్ పరిస్థితి ఇప్పుడు అత్యంత క్లిష్టంగా మారింది. ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రెండు మ్యాచ్‌లు కూడా బలమైన జట్లపైనే ఉండటం ఆరెంజ్ ఆర్మీకి పెద్ద సవాలుగా మారింది. తదుపరి మ్యాచ్‌ల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మరియు ఆర్సీబీని ఎదుర్కోనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై, గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుండగా.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

ఇక పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కూడా 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా, కోల్‌క‌తా నైట్ రైడర్స్ 9 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ జట్లు కూడా ఇంకా ప్లే ఆఫ్స్ రేసులోనే కొనసాగుతున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

ఇది కూడా చదవండి..: Delhi Capitals Playoff Chances | 211 పరుగుల ఛేదనలో ఢిల్లీ సంచలన విజ‌యం.. ప్లే ఆఫ్స్ చేరుకునే అవ‌కాశం ఉందా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *