అక్షరటుడే, కామారెడ్డి: TPO Forgery Case | కామారెడ్డి మున్సిపాలిటీని కుదిపేస్తున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (TPO) సంతకం ఫోర్జరీ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. సినిమా సీన్లను తలపించేలా సాగుతున్న ఈ కేసు విచారణలో తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల సోదాల నుంచి తప్పించుకునే క్రమంలో కీలక ఆధారాలు బూడిదగా మారడం ఇప్పుడు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
TPO Forgery Case | పోలీసుల ఎంట్రీ.. ఇంట్లో మాయమైన ఫైళ్లు!
ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆధారాల కోసం నిందితుడి నివాసంలో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అయితే, పోలీసులకు అక్కడ ఎలాంటి కీలక దస్త్రాలు లభించకపోవడం గమనార్హం.
TPO Forgery Case | భార్య స్కెచ్.. స్నేహితుడి ‘కాల్పుల’ పర్వం!
పోలీసులు సోదాలకు వస్తున్నారనే సమాచారంతో నిందితుడి భార్య అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. పోలీసుల కంటపడకుండా ఇంట్లోని కీలక దస్త్రాలను దాచేసి, వాటిని వెంటనే తన భర్త స్నేహితుడికి అప్పగించింది.
ఆ స్నేహితుడు మరో అడుగు ముందుకు వేసి, ఆ దస్త్రాలు దొరికితే ముప్పు తప్పదని భావించి వాటన్నింటినీ గుట్టుచప్పుడు కాకుండా తగులబెట్టాడు.
TPO Forgery Case | ‘అక్షరటుడే’ కథనంతో కదిలిన యంత్రాంగం
దస్త్రాల దహనం ఉదంతాన్ని ‘అక్షరటుడే’ పత్రిక ప్రముఖంగా ప్రచురించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసును పక్కదారి పట్టించేందుకు జరిగిన ఈ కుట్రపై విచారణ వేగవంతం చేశారు.
ఇద్దరూ పోలీసుల కస్టడీలోనే.. వేర్వేరుగా విచారణ
రెండు రోజుల క్రితం ప్రధాన నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా దస్త్రాలను తగులబెట్టిన అతని స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
కేసులో సాక్ష్యాలను నాశనం చేసినందుకు అతనిపై కూడా చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరినీ వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తున్నట్లు సమాచారం.
కేసు అత్యంత కీలక దశకు చేరుకోవడంతో కామారెడ్డిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కీలకమైన దస్త్రాలు కాలి బూడిదవడంతో.. అసలు నిజాలు బయటకు వస్తాయా? ఫోర్జరీ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల హస్తం కూడా ఉందా? బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా?
అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హైడ్రామాలో పోలీసుల తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న!


