అక్షరటుడే, ఇందూరు: Public Health Crisis | దేశంలో మత్తు పదార్థాల వినియోగం ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందని అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ (Addiction Medicine Specialty Section) ఛైర్మన్ డాక్టర్ విశాల్ ఆకుల (Vishal Akula) అన్నారు. జైపూర్లో నిర్వహించిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (Indian Psychiatric Society) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
Public Health Crisis | సమగ్ర కార్యాచరణ ప్రణాళిక..
మత్తు పదార్థాల వినియోగం.. ప్రవర్తనా వ్యసనాల సమస్యపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను డాక్టర్ విశాల్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆల్కహాల్, పొగాకు, ఓపియాడ్లు, గంజాయి వంటి పదార్థాలతో పాటు డిజిటల్ వ్యసనాలు (Digital Addictions) కూడా వ్యక్తులు, కుటుంబాలు, సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ కారణంగా 30 లక్షలకు పైగా మరణాలు, పొగాకు వాడకం వల్ల 80 లక్షలకు పైగా మరణాలు జరుగుతున్నాయన్నారు. అలాగే.. మత్తు పదార్థాల వినియోగం చాలా సందర్భాల్లో యవ్వన దశలోనే ప్రారంభమవుతుండడం ఆందోళనకర అంశమని పేర్కొన్నారు.
Public Health Crisis | పాఠ్యాంశంగా మత్తు పదార్థాల నివారణ అంశాలు..
భారతీయ సైకియాట్రిక్ సొసైటీ దేశవ్యాప్తంగా హైస్కూల్ పాఠ్యాంశాల్లో ‘మత్తు పదార్థాల నివారణ.. సమాజంలో యువత పాత్ర.. ప్రత్యేకంగా అక్రమ మాదకద్రవ్యాలపై అవగాహన’ అనే అంశాన్ని ప్రత్యేక అధ్యాయంగా చేర్చాలని బలంగా సిఫారసు చేస్తోందని విశాల్ తెలిపారు. ఈ చర్య ద్వారా విద్యార్థుల్లో ప్రారంభ దశలోనే అవగాహన పెంపొందించడం, యువతను నివారణ చర్యల్లో భాగస్వామ్యులను చేయడం, మత్తు పదార్థాల వినియోగం తగ్గించవచ్చన్నారు. దీర్ఘకాలిక ప్రజా ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని భారత ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖల దృష్టికి అధికారికంగా తీసుకెళ్లనున్నట్లు సొసైటీ డిసైడ్ చేసిందన్నారు.
వైద్యులకు ప్రాక్టికల్ అకడమిక్ కార్యక్రమాలు..
అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ రాబోయే ఏడాదికి జాతీయస్థాయిలో సమన్వయం బలోపేతం, వైద్యులకు ప్రాక్టికల్ అకడమిక్ ప్రోగ్రాంలు, సులభమైన ఓపీడీ మార్గాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనుందని విశాల్ పేర్కొన్నారు. యువ సైకియాట్రిస్టులకు మార్గదర్శకత్వం, మల్టీసెంట్రిక్ పరిశోధనలు, విధాన పరమైన సూచనలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు, పాఠశాల స్థాయి నివారణ చర్యలను ముఖ్య లక్ష్యాలుగా నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన ఐపీఎస్ అధ్యక్షుడు డాక్టర్ టీఎస్ సత్యనారాయణ రావు, గౌరవ ప్రధాన కార్యదర్శి డా. అరుణ్ మార్వాలేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి:Cyber Fraud | సైబర్ దొంగల్లో బ్యాంక్ అధికారులు.. 52 మంది నిందితుల అరెస్ట్

