Toss Fixing Rumours | సీఎస్‌కే–ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో టాస్ ఫిక్సింగ్ జ‌రిగిందా?.. వైరల్ వీడియో వెనక అసలు నిజం ఇదే!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toss Fixing Rumours | ఐపీఎల్ ప్రారంభమైనప్పుడల్లా మ్యాచ్ ఫిక్సింగ్, టాస్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చకు వస్తూనే ఉంటాయి. గతంలో ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్–రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సమయంలో కూడా టాస్ ఫిక్సింగ్ జరిగిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఆ ఘటన తర్వాత టాస్ సమయంలో కాయిన్‌పై హెడ్ పడిందా, టేల్స్ పడిందా అనేది ప్రేక్షకులకు స్పష్టంగా చూపించే విధంగా కెమెరా ఫోకస్ పెంచారు. ఇప్పుడు తాజాగా చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్–సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత మరోసారి అలాంటి చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Captain Pat Cummins) ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను చూపిస్తూ టాస్ విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Toss Fixing Rumours | క‌మిన్స్‌కి వినిపించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే..

మ్యాచ్ ప్రారంభానికి ముందు కామెంటేటర్ రవిశాస్త్రి టాస్ వేయాలని సీఎస్‌కే (Chennai Super Kings) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఆహ్వానించారు. టాస్ కోసం కాయిన్ గాల్లోకి ఎగరగానే ప్యాట్ కమిన్స్ “హెడ్స్” అని పిలిచాడు. కాయిన్ “టేల్స్” రావడంతో మ్యాచ్ రిఫరీలు రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచినట్లు ప్రకటించారు. అనంతరం రుతురాజ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ చెన్నైకి హోం గ్రౌండ్‌లో చివరి మ్యాచ్ కావడంతో స్టేడియంలో అభిమానులు భారీగా హోరెత్తించారు. రుతురాజ్ టాస్ గెలిచిన వెంటనే ప్రేక్షకుల కేరింతలు మరింత పెరిగాయి. ఆ గోల కారణంగా రుతురాజ్ ఏ నిర్ణయం తీసుకున్నాడో కమిన్స్‌కు స్పష్టంగా వినిపించలేదని తెలుస్తోంది.

Toss Fixing Rumours | సోషల్ మీడియాలో వైరల్

ఆ సమయంలో పక్కనే ఉన్న ఆటగాళ్లు ఏమైందని అడగగా, “ఏం వినిపించలేదు” అన్నట్టుగా కమిన్స్ స్పందించాడు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ను తప్పుగా అర్థం చేసుకుని, కమిన్స్ “టేల్స్” అని పిలిచాడని కొందరు ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే వాస్తవానికి కమిన్స్ “హెడ్స్” అని స్పష్టంగా పిలిచిన విషయం అక్కడే ఉన్న కామెంటేటర్లు, మ్యాచ్ అధికారులకు వినిపించింది. టాస్ ప్రక్రియలో ఎలాంటి వివాదం లేదా ఫిక్సింగ్ జరగలేదని పరిస్థితులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వీడియో పూర్తి సందర్భంతో ఉండకపోవచ్చు. చిన్న కన్ఫ్యూజన్ కూడా కొన్నిసార్లు పెద్ద వివాదంలా మారే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి చూపించింది.

ఇది కూడా చదవండి..: SRH Playoffs | క్లాసెన్ – ఇషాన్ కిషన్ కిల్లింగ్ షో.. చెన్నైకి షాక్, ప్లే ఆఫ్స్‌లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *