SRH Playoffs | క్లాసెన్ – ఇషాన్ కిషన్ కిల్లింగ్ షో.. చెన్నైకి షాక్, ప్లే ఆఫ్స్‌లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SRH Playoffs | ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత కీలక మ్యాచ్‌లలో ఒకటిగా భావించిన ఈ పోరు అభిమానులకు ఉత్కంఠభరిత అనుభవాన్ని అందించింది. చెపాక్ స్టేడియం (Chepauk Stadium) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది.

లక్ష్య ఛేదన ప్రారంభంలోనే సన్‌రైజర్స్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో స‌రైన‌ ప్రదర్శన ఇవ్వలేకపోతున్న హెడ్ కేవలం 6 పరుగులకే ముకేశ్ చౌదరి బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సన్‌రైజర్స్‌పై తొలిదశలోనే ఒత్తిడి పెరిగింది.

SRH Playoffs | అదే పెద్ద త‌ప్పు..

ఆ తర్వాత అభిషేక్ శర్మ (Abhishek Sharma) కొంతసేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేసిన అభిషేక్ ఎనిమిదో ఓవర్‌లో వికెట్ కోల్పోయాడు. అప్పటికి సన్‌రైజర్స్ 56 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పింది హెన్రిచ్ క్లాసెన్ – ఇషాన్ కిషన్ జోడీ. చెన్నై ఆటగాళ్లు క్లాసెన్ క్యాచ్‌ను ఆరంభంలోనే వదిలేయడం పెద్ద తప్పిదంగా మారింది. ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్న క్లాసెన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ బౌండరీలతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు.క్లాసెన్‌కు మరోవైపు ఇషాన్ కిషన్ అద్భుత సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 41 బంతుల్లోనే 75 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు.

SRH Playoffs | సన్‌రైజర్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌లోకి

క్లాసెన్ 26 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేసి స్టంప్ అవుట్ అయ్యాడు. అయితే మ్యాచ్ ఇంకా పూర్తిగా ముగియలేదు. చివరి ఐదు ఓవర్లలో ఇరు జట్లకు అవకాశాలు కనిపించినా ఇషాన్ కిషన్ ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. విజయానికి చేరువైన సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయినప్పటికీ అప్పటికే జట్టును గెలుపు గడప వరకు తీసుకొచ్చాడు.ఇషాన్ 47 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు.చివర్లో సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్ వేగంగా పరుగులు సాధించి ఆరు బంతులు మిగిలుండగానే జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించగా, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాత్రం టోర్నీలో ముందుకు వెళ్లే అవకాశాలను దాదాపు కోల్పోయినట్టే కనిపిస్తోంది.

SRH Playoffs | ఈ విజయంతో సన్‌రైజర్స్

ప్రస్తుత లెక్కల ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇప్పటికే టాప్ ప్లేస్‌కి చేరుకోగా, ఇప్పుడు గుజరాత్, హైదరాబాద్ (Hyderabad) కూడా ప్లే ఆఫ్ లోకి చేరాయి. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్ రేసులో ఉంగా, రాజస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే మాత్రం పాయింట్ల పట్టికలో కింద ఉన్న ఐదు జట్ల మధ్య మళ్ళీ హోరాహోరీ పోరు త‌ప్ప‌దు.

ఇది కూడా చదవండి..: Delhi Capitals Win | కీల‌క మ్యాచ్‌లో ఢిల్లీ విజ‌యం.. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేస్ మరింత హీట్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *