Delhi Capitals Win | కీల‌క మ్యాచ్‌లో ఢిల్లీ విజ‌యం.. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేస్ మరింత హీట్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Capitals Win | ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్ ముగింపు దశకు చేరుతున్న నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేస్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆదివారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 62వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) అద్భుత ప్రదర్శనతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోగా, రాజస్థాన్ వరుసగా మూడో పరాజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ య‌శ‌స్వి జైస్వాల్ త్వరగా పెవిలియన్ చేరాడు. అయితే యువ సంచలనం వైభవ్ సూర్య‌వంశీ మరోసారి తన దూకుడు ఆటతో ఆకట్టుకున్నాడు. కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Delhi Capitals Win | రియాన్​ పరాగ్​ హాఫ్​ సెంచరీ

ఆ తర్వాత ధృవ్ జురెల్ 53 పరుగులతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌ (Riyan Parag) కూడా హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 14 ఓవర్లకే రాజస్థాన్ 160 పరుగుల వద్దకు చేరుకుంది. ఒక దశలో 220కి పైగా స్కోరు చేస్తుందనే అంచనాలు కనిపించాయి. కానీ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చింది మిచెల్ స్టార్స్ బౌలింగ్. డెత్ ఓవర్లలో తన అనుభవాన్ని ప్రదర్శించిన స్టార్క్, కట్టుదిట్టమైన బంతులతో రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. 4 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయిన రాజస్థాన్ 20 ఓవర్లలో 193 పరుగులకు పరిమితమైంది.

Delhi Capitals Win | ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో..

194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్‌, అభిషేక్ పోరెల్ (Abishek Porel) అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు. రాజస్థాన్ బౌలర్లపై దూకుడు ప్రదర్శించిన ఈ జోడీ కేవలం 10 ఓవర్లలోనే 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పారు. మధ్యలోఆర్చ‌ర్ రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌కు ఆశలు కలిగించినా, ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ 34 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

చివర్లో అశుతోష్ శర్మ వేగవంతమైన బ్యాటింగ్‌తో ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ పోరులో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ వరుస ఓటములతో ఒత్తిడిలో పడింది. ఇప్పుడు నాలుగో స్థానం కోసం ఢిల్లీ, రాజస్థాన్, అలాగే చెన్నైసూప‌ర్ కింగ్స్ మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారింది. రాబోయే మ్యాచ్‌ల్లో ప్రతి పరుగు, ప్రతి వికెట్ ప్లేఆఫ్స్ సమీకరణాలను మార్చే అవకాశముండటంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

ఇది కూడా చదవండి..: RCB Playoffs Qualification | పంజాబ్​పై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *