అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Raids HMWSSB GM | భాగ్యనగరంలో అవినీతి తిమింగలాల వేటలో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) మరో భారీ నెట్‌వర్క్‌ను గురిపెట్టింది. హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ (GM) అనంతలక్ష్మికుమార్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, ఆయన సామ్రాజ్యంపై ఉడుం పట్టు పట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే బలమైన ఆరోపణలతో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి.
ACB Raids HMWSSB GM | ఏకకాలంలో 9 చోట్ల దాడులు
ప్రస్తుతం రెడ్‌హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 జీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మికుమార్ నివాసంతో పాటు, ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 9 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
మల్లాపూర్‌లోని ఆయన సొంత నివాసంలో సోదాలు చేస్తుండగా బయటపడ్డ అక్రమ ఆస్తుల వివరాలు చూసి స్వయంగా అధికారులే అవాక్కయ్యారు.
ACB Raids HMWSSB GM | స్వాధీనం చేసుకున్న భారీ సొత్తు
సోదాల సందర్భంగా లక్ష్మికుమార్ ఇళ్లలో లభించిన సంపద చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. రూ. 1.10 కోట్ల లిక్విడ్ క్యాష్ (నోట్ల కట్టలు కుప్పలుగా లభించడంతో వాటిని లెక్కించడానికి అధికారులు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లను తెప్పించారు). 2.1 కిలోల మేలిమి బంగారు ఆభరణాలు లభించాయి. దీనికితోడు 9.2 కిలోల వెండి వస్తువులు చూసి అధికారులకు దిమ్మ తిరిగింది.
ACB Raids HMWSSB GM | రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు?
నగదు, బంగారంతో పాటు హైదరాబాద్‌లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, రెండు లగ్జరీ కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇంకా పలు బ్యాంక్ లాకర్లను తెరవాల్సి ఉందని, అవి కూడా తెరిస్తే మరిన్ని అక్రమాస్తుల విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లక్ష్మికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ భారీ రైడ్ జలమండలితో పాటు ప్రభుత్వ శాఖల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Paidi Rakesh Reddy POCSO | పొక్సో కేసు వ్యక్తిగత వ్యవహారం…..


