UPI PF Withdrawal | త్వరలో యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI PF Withdrawal | పీఎఫ్ అకౌంట్ నుంచి ఖాతాదారులు డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కోసం గతంలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. నెలల తరబడి కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. తర్వాత కాలంలో ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటు వచ్చింది. అయితే సర్వర్ సమస్యలు, క్లెయిమ్‌ల తిరస్కరణతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

UPI PF Withdrawal | టెస్టింగ్‌ పూర్తి..

పీఎఫ్‌ చందాదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించడానికి ఈపీఎఫ్‌వో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పీఎఫ్ ఖాతాలోని డబ్బులను యూపీఐ ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) ప్రకటించారు. డిజిటల్ ఇండియా పరిధిని సామాన్య ఉద్యోగికి మరింత చేరువ చేసేలా ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు.

UPI PF Withdrawal | ఎలా పనిచేస్తుందంటే..

ఈ కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలోని కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేసి, విత్‌డ్రా చేసుకోవడానికి అర్హత ఉన్న మిగిలిన మొత్తాన్ని యూపీఐ గేట్‌వే పరిధిలోకి తీసుకువస్తారు. చందాదారులు యూపీఐ పిన్ నమోదు చేయడం ద్వారా సురక్షితంగా ఈ లావాదేవీని పూర్తి చేయవచ్చు. పీఎఫ్ నిధులను యూపీఐ (UPI) ద్వారా ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా లబ్ధిదారులకు నిధులు అందే సమయం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

UPI PF Withdrawal | పూర్తిస్థాయిలో ఆటో సెటిల్‌మెంట్‌ సైతం..

ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్‌లోని నిధులను యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి విత్‌డ్రా చేసుకునే సౌలభ్యమే కాకుండా రూ. 5 లక్షల వరకు ఉండే క్లెయిమ్‌లను ఆటో సెటిల్‌మెంట్ చేసేలా నిబంధనలను సవరించారు. ఇప్పటివరకు అడ్వాన్స్ లేదా పాక్షిక విత్‌డ్రాలకే ఈ ఆటో సెటిల్‌మెంట్‌ పరిమితమయ్యింది. త్వరలో పూర్తి స్థాయి క్లెయిమ్‌లకు కూడా విస్తరిస్తున్నారు. ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ ఆటోమేటిక్‌గా బదిలీ అయ్యేలా వ్యవస్థను మారుస్తున్నారు. రూ. 5 లక్షల వరకు ఉండే క్లెయిమ్‌లను దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే ఎలాంటి మాన్యువల్ వెరిఫికేషన్ లేకుండా ఆటోమేటిక్‌గా క్లియర్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి..: May 21 Gold Rates | మళ్లీ భ‌గ్గుమంటున్న ప‌సిడి.. హైదరాబాద్​లో తులం ధర​ ఎంతంటే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *