అక్షరటుడే వెబ్‌డెస్క్: Agniveer Recruitment | అగ్నిపథ్ పథకం ద్వారా దేశ రక్షణలో భాగస్వాములైన అగ్నివీరులకు శుభవార్త. నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత, శాశ్వత ప్రాతిపదికన సైన్యంలో కొనసాగే అగ్నివీరుల సంఖ్యను పెంచాలని భారత సైన్యం ( Indian Army )కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Agniveer Recruitment | శాశ్వత నియామకాల పెంపు..
ప్రస్తుతం అగ్నిపథ్ పథకం నిబంధనల ప్రకారం, నాలుగేళ్ల శిక్షణ అనంతరం కేవలం 25 శాతం మంది అగ్నివీరులకు మాత్రమే శాశ్వత ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అయితే, ఈ సంఖ్యను 50 శాతానికి పెంచాలని ఆర్మీ, వాయుసేనలు యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు, భారత నౌకాదళం తన అగ్నివీరులలో ఏకంగా 75 శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన రిటైన్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Agniveer Recruitment | నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం..
శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన సైనికులు సైన్యంలో ఉంటే, ఆధునిక ఆయుధ వ్యవస్థలు , అత్యాధునిక సాంకేతికతపై పట్టు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. త్రివిధ దళాలలో సిబ్బంది కొరతను తీర్చడమే కాకుండా, నైపుణ్యం కలిగిన బలగాలను సైన్యంలోనే ఉంచుకోవడం వల్ల రక్షణ రంగం మరింత బలోపేతం అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆర్మీలో తాజాగా ఏర్పాటు చేసిన ‘భైరవ్ బెటాలియన్ల’ వంటి విభాగాల్లో ఈ అనుభవజ్ఞులను కొనసాగించే అవకాశం ఉంది.
Agniveer Recruitment | సుస్థిరమైన కెరీర్ కల్పించాలని ..
2023 ప్రారంభంలో సైన్యంలో చేరిన మొదటి బ్యాచ్ అగ్నివీరుల నాలుగేళ్ల పదవీకాలం ఈ ఏడాది చివరికి ముగియనుంది. ఈ నేపథ్యంలో వారి ప్రతిభను బట్టి భవిష్యత్తును నిర్ణయించేందుకు త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. అగ్నివీరుల నియామకాలను పెంచడం , శాశ్వత ఉద్యోగ అవకాశాలను విస్తరించడం ద్వారా యువతకు సైన్యంలో సుస్థిరమైన కెరీర్ కల్పించాలని రక్షణ శాఖ భావిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే, దేశవ్యాప్తంగా అగ్నివీరులకు ఇది గొప్ప ఊరటనిస్తుంది.
ఇది కూడా చదవండి: Mumbai Pune Railway | ముంబై–పుణె రైల్వే ట్రాక్‌పై విరిగిపడ్డ కొండచరియలు