Air India Drug Test | ఎయిరిండియా కీలక నిర్ణయం.. పైలట్లందరికీ డోప్‌ టెస్ట్‌ తప్పనిసరి!

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా విమానయాన సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Air India Drug Test | ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా విమానయాన సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్లందరికీ డోప్‌ టెస్ట్‌ను (డ్రగ్ టెస్ట్) తప్పనిసరి చేసింది. ఇటీవల ఫుకెట్ నుంచి దిల్లీ వస్తున్న విమాన ఘటనలో పైలట్ గంజాయి సేవించినట్లు పరీక్షల్లో తేలడంతో సంస్థ ఈ కఠిన నిబంధనను తీసుకువచ్చింది.

డీజీసీఏ (DGCA) సూచించే సాధారణ ర్యాండమ్ తనిఖీలతో పాటు, అంతర్గత వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గురువారం నుంచే ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది.

Air India Drug Test | పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారంటే?

గురుగ్రామ్‌లోని అకాడమీలో శిక్షణ సమయంలో, అలాగే విమాన ప్రయాణం ముగిసిన తర్వాత ఎయిరిండియా ఫ్లైట్ బ్రీఫింగ్ సెంటర్లు, కార్యాలయాల్లో ఈ డ్రగ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ప్రయాణికుల భద్రత, పారదర్శకత, తమ సంస్థ పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలను కాపాడేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో వెల్లడించారు. కాగా, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో కలిపి మొత్తంగా సుమారు 5,000 మంది పైలట్లు సేవలందిస్తున్నారు.

Air India Drug Test | నేపథ్యం ఇదీ..

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం ఆగస్టు 4న తీవ్ర కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 145 మంది ఉన్నారు. ఘటన అనంతరం పైలట్లకు నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో.. పైలట్-ఇన్‌-కమాండ్‌కు తొలి పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత నిర్వహించిన సైకోయాక్టివ్ పరీక్షలో ఆయన గంజాయి సేవించినట్లు అధికారికంగా నిర్ధారణ అయ్యింది.

 

ఇది కూడా చదవండి: Armoor Municipal Corruption | ఆర్మూర్​ బల్దియాలో ‘మామూళ్ల’ పర్వం..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *