Telangana SIR conspiracy | ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణపై కుట్రలు జరుగుతున్నాయి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎస్ఐఆర్ (SIR) పేరుతో పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana SIR conspiracy | రాష్ట్రంలో ఎస్ఐఆర్ (SIR) పేరుతో పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ తర్వాత తెలంగాణనే తమ టార్గెట్‌ అని కొందరు అంటున్నారని, రాష్ట్రంలో ఏకంగా 70 లక్షల ఓట్లు తొలగిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్‌ ఆదివాసీ భవన్‌లో జరిగిన ‘మైనారిటీస్ ఎక్సెలన్స్ సమ్మిట్’‌లో సీఎం పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

అర్హులైన వారి ఒక్క ఓటు కూడా పోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఓట్లు తొలగించే వారి కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించనివ్వకూడదని పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ ప్రతి కార్యకర్త ఒక్కో రేవంత్ రెడ్డిలా మారి రాబోయే పది రోజులు కష్టపడి పనిచేయాలని సూచించారు. గుజరాత్ నుంచి వస్తున్న వారిని అడ్డుకోవడానికి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి అందరూ నడుము బిగించాలని కోరారు. ఓటర్ల పేర్లు నమోదు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకూడదని, చిన్న చిన్న తప్పులతో ఎవరి ఓటూ గల్లంతయ్యే పరిస్థితి రాకూడదన్నారు. బీఎల్‌ఓ (BLO) పనితీరు ఎలా ఉన్నప్పటికీ, ప్రతి కార్యకర్త బీఎల్‌ఏ (BLA) లా మారి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని ఆదేశించారు.

Telangana SIR conspiracy | హిందూ, ముస్లింలు రెండు కళ్ల లాంటి వారు..

దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం లౌకిక (సెక్యులర్) వర్గాలకు రక్షణ ఉంటుందని, కాంగ్రెస్ మాత్రమే నిజమైన సెక్యులర్ పార్టీ అని సీఎం రేవంత్  ( Revanth Reddy )స్పష్టం చేశారు. లౌకికవాదుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఎందరో ప్రయత్నించినా ప్రధాని మోదీ, అమిత్ షా కూడా వాటిని రద్దు చేయలేకపోయారని గుర్తుచేశారు. తమకు హిందూ, ముస్లింలు రెండు కళ్లలాంటి వారని తేల్చిచెప్పారు.

Telangana SIR conspiracy | టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం..

గత ప్రభుత్వం కనీసం గ్రూప్-1 పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని, గతంలో ఒక ఆర్‌ఎంపీ (RMP) డాక్టర్‌ను కూడా టీజీపీఎస్సీ సభ్యుడిగా నియమించారని సీఎం మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి, యూపీఎస్సీ (UPSC) తరహాలో బలోపేతం చేశామని తెలిపారు. రిటైర్డ్ డీజీపీని టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించి అత్యంత పారదర్శకంగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. కొందరు ఈ పరీక్షలను రద్దు చేయించాలని సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, తాము సమర్థులైన లాయర్లను నియమించి బలమైన వాదనలు వినిపించామని చెప్పారు. నిబంధనలను సడలించి మరీ బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం, క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Education Development | విద్యారంగ అభివృద్ధిలో జిల్లాకు అన్యాయం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *