AP Economic Growth | జాతీయ సగటును దాటిన వృద్ధిరేటు.. ఆర్థిక ప్రగతిపై సీఎం కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా శాఖ 2026 జులై నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: AP Economic Growth | ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా శాఖ 2026 జులై నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించింది. రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు , సంక్షోభం ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో మంచి వృద్ధి నమోదైనట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసికంలో ఏపీ ఏకంగా 10.7 శాతం వృద్ధిరేటును సాధించింది. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 13.5 శాతం, పారిశ్రామిక రంగంలో 10.6 శాతం, సేవల రంగంలో 9.9 శాతం చొప్పున ప్రగతి కనబడటం విశేషం.

AP Economic Growth | జాతీయ సగటును దాటిన ఏపీ పురోగతి..

గతంలో అంటే 2023-24 కాలంలో 6.5 శాతంగా ఉన్న రాష్ట్ర వృద్ధిరేటు, 2025-26 నాటికి ఏకంగా 9.9 శాతానికి ఎగబాకింది. అంతేకాకుండా, గడిచిన రెండేళ్లుగా జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ మరింత మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని ప్రణాళికా విభాగం తన నివేదికలో వెల్లడించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల జీఎస్టీ వసూళ్లు ఏకంగా 21 శాతం పెరిగి రూ.13,282 కోట్లకు చేరుకున్నాయి. అలాగే సాధారణ ఎగుమతులు 10.5 శాతం వృద్ధితో రూ.16,322 కోట్లను తాకగా, ఎస్‌టీపీఐ ఎగుమతుల్లో 32.2 శాతం పురోగతి కనిపించింది. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు 51.6 శాతం పెరగగా, రూ.2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల గ్రౌండింగ్ 75.4 శాతానికి చేరుకుంది.

AP Economic Growth | సీఎం కీలక ఆదేశాలు..

ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో రాష్ట్రం 15 శాతం వృద్ధిరేటు సాధించేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు  ( Chandrababu Naidu  )అధికారులను ఆదేశించారు. ప్రజలపై ఎలాంటి అదనపు ధరల భారం పడకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ విభాగం నిర్దేశిత అత్యున్నత లక్ష్యాలను చేరుకునేలా వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లక్ష్య సాధనలో కచ్చితమైన ప్రమాణాలు పాటించడంతో పాటు, నీటి లభ్యత పెంపు, ఉత్పత్తులకు అదనపు విలువ (వాల్యూ అడిషన్) చేకూర్చడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. దీనికి సంబంధించి జిల్లా, నియోజకవర్గ, మండలాల వారీగా వేర్వేరుగా నివేదికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి:  Parliament Campus Tension | పార్లమెంట్​ ఆవరణలో ఉద్రిక్తత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *