అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aprilia SR Tribute Edition | ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన సంస్థ ఏప్రిలియా భారత మార్కెట్ (Indian market)లో తన ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 175 స్కూటర్లకు కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్‌లను విడుదల చేసింది.
ప్రముఖ ఇటాలియన్ టూవీలర్ తయారీ సంస్థ అయిన ఏప్రిలియా భారత మార్కెట్‌లోకి తన ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 175 స్కూటర్లకు కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్‌లను తీసుకువచ్చింది. స్టైలిష్ డిజైన్, స్పోర్టీ లుక్‌తో యువతలో మంచి గుర్తింపు పొందిన ఈ స్కూటర్.. ఇప్పుడు మరింత ప్రత్యేక రూపంలో లాంచ్ అయ్యింది. దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న భారత సైనికుల గౌరవ సూచకంగా, దేశ రక్షణలో ప్రాణాలు అర్పించినవారికి నివాళిగా ఈ స్కూటర్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. అందుకే వీటికి ‘ట్రిబ్యూట్ ఎడిషన’ అనే పేరు పెట్టినట్లు పేర్కొంది.
Aprilia SR Tribute Edition | చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
ఈ ప్రత్యేక ఎడిషన్‌లలో ఇంజిన్, పనితీరు, ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. స్టాండర్డ్ మోడళ్లలో ఉన్న అదే మెకానికల్ సెటప్, అవే ఫీచర్లు ఇందులో కూడా కొనసాగించారు. అయితే డిజైన్‌లో మాత్రం మార్పులు చేశారు. సాధారణ మోడళ్లతో పోలిస్తే కొత్త రంగులు, ప్రత్యేక గ్రాఫిక్స్, మిలిటరీ థీమ్ ఎలిమెంట్స్ కారణంగా ఈ స్కూటర్లు మరింత ప్రీమియం, యూనిక్ లుక్‌ను సొంతం చేసుకున్నాయి. రక్షణ బలగాలు వినియోగించే ప్రత్యేక రంగులు, డిజైన్ గ్రాఫిక్స్‌తో ఈ స్కూటర్ ఆకట్టుకుంటుంది.
Aprilia SR Tribute Edition | ఇంజిన్, పనితీరు..
ఏప్రిలియా ఎస్ఆర్ 125 ట్రిబ్యూట్ ఎడిషన్‌లో 124 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను కొనసాగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.6 హెచ్‌పీ పవర్, 10.4 ఎన్ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు సరిపోతుంది.
ఎస్ఆర్ 175 ట్రిబ్యూట్ ఎడిషన్‌లో 174 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ పవర్‌ట్రెయిన్ 13.2 హెచ్‌పీ శక్తితో పాటు 14.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పోర్టీ రైడింగ్‌ను ఇష్టపడే వారికి ఇది చక్కటి ఎంపికగా నిలుస్తుంది.
Aprilia SR Tribute Edition | ధరలిలా..
ప్రత్యేక డిజైన్, ట్రిబ్యూట్ థీమ్ వల్ల ఈ కొత్త ఎడిషన్‌ల ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎస్ఆర్ 125 ట్రిబ్యూట్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.17 లక్షలుగా ఉంది. ఇది సాధారణ ఎస్ఆర్ 125 మోడల్ కంటే రూ.3 వేలు అధికం.
ఎస్ఆర్ 175 ట్రిబ్యూట్ ఎడిషన్ ధర రూ.1.24 లక్షలుగా నిర్ణయించారు. ఇది స్టాండర్డ్ ఎస్ఆర్ 175 కంటే రూ.2 వేలు ఎక్కువ.
ఇది కూడా చదవండి..:Pakistan Civilian Handover | సరిహద్దుల్లో మానవత్వం: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్-పాక్ సైనికాధికారుల అరుదైన కరచాలనం!