Bank Cashier Fraud | నిజ జీవిత ‘లక్కీ భాస్కర్’.. రూ. 8.7 కోట్లు కొట్టేసి, ఏమీ తెలియనట్లు అదే బ్యాంకులో డ్యూటీ

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్ : Bank Cashier Fraud | దురాశ, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయే ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్.. అడ్డదారిలో కోట్లు ఎలా సంపాదించాడు? అనే కథాంశంతో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో హీరో తన తెలివితేటలతో పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటాడు. కానీ, అది సినిమా మాత్రమే.. నిజ జీవితంలో తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకాల్సిందేనని గుజరాత్‌లో జరిగిన ఒక ఘటన నిరూపించింది. సినిమా ఇన్‌స్పిరేషన్‌తోనో ఏమో గానీ, ఓ బ్యాంక్ ఉద్యోగి ఏకంగా రూ. 8.7 కోట్ల బ్యాంకు సొమ్మును నొక్కేసి, ఏమీ తెలియనట్లు మూడు నెలల పాటు అదే బ్యాంకులో ఉద్యోగం చేస్తూ చివరకు అడ్డంగా దొరికిపోయాడు.

Bank Cashier Fraud | నమ్మకమే పెట్టుబడిగా..

గుజరాత్‌లోని గాంధీ రోడ్డులో ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ శాఖలో హర్షిద్ కడియార్ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా జాయింట్ కస్టోడియన్‌గా నమ్మకంగా పనిచేస్తున్నాడు. దీంతో ఆర్‌బీఐ (RBI) ఏర్పాటు చేసిన ప్రత్యేక నగదు నిల్వ కేంద్రం (కరెన్సీ చెస్ట్) బాధ్యతలను కూడా ఇతనే చూసుకునేవాడు. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, 2026 జనవరి 13వ తేదీ రాత్రి భద్రతా వలయాన్ని దాటుకుని కరెన్సీ చెస్ట్ నుంచి కోట్ల రూపాయలను ఒక పెట్టెలోకి మార్చేశాడు. బయటకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ సిబ్బందితో ‘స్క్రాప్ మెటీరియల్ (పాత సామాన్లు) పారేయడానికి వెళ్తున్నా’ అని అబద్ధం చెప్పి రూ. 8.7 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా దాటించేశాడు.

Bank Cashier Fraud | సీసీటీవీ టెక్నాలజీతో మైండ్ గేమ్..

ఆ తర్వాత బ్యాంకు ఆడిటింగ్‌లో రూ. 8.7 కోట్ల తేడా రావడంతో అధికారుల నిఘా హర్షిద్‌పై పడింది. అయితే, ఇక్కడే హర్షిద్ ఒక పక్కా ప్లాన్ వేశాడు. సాధారణంగా బ్యాంకుల్లోని సీసీటీవీ ఫుటేజ్ 90 రోజుల (మూడు నెలలు) తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఆ ఫుటేజ్ డిలీట్ అయిపోతే తనపై ఎలాంటి సాక్ష్యం ఉండదని భావించిన అతడు.. దొంగతనం చేసిన తర్వాత కూడా ఏమీ తెలియనట్లు రోజూ బ్యాంకుకు వస్తూ తన విధులను యథావిధిగా నిర్వర్తించాడు. అధికారులు కూడా నిందితుడికి అనుమానం రాకుండా సైలెంట్‌గా ఉంటూ లోతుగా దర్యాప్తు చేశారు.

Bank Cashier Fraud | చివరకు దొరికాడు

హర్షిద్ అనుకున్నట్లే మూడు నెలలు గడిచాయి. కానీ, టెక్నాలజీ సాయంతో పోలీసులు డిలీట్ అయిన సీసీటీవీ ఫుటేజ్‌ను విజయవంతంగా రికవరీ చేశారు. ఆ వీడియోలో హర్షిద్ కరెన్సీ బాక్సులను తరలిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించడంతో అతని గుట్టు రట్టయింది. ఈ కీలక సాక్ష్యంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ భారీ దోపిడీలో హర్షిద్‌కు బ్యాంకులోని ఇతర సహచరులు ఎవరైనా సహకరించారా? అంత పెద్ద మొత్తాన్ని ఎక్కడ దాచారు? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

 

ఇది కూడా చదవండి: Global Debt Crisis | అందరూ అప్పుల అప్పారావులే.. డెట్ లోనూ పెద్దన్నే ముందు!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *