Fake Engineering Certificates | కామారెడ్డిలో నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లపై విచారణ..? నెల రోజులుగా కొనసాగుతున్న దర్యాప్తు

పేరుమోసిన ఓ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు విక్రయించారన్న ప్రచారం కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Fake Engineering Certificates | ఉమ్మడి రాష్ట్రంలో పేరుమోసిన ఓ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు విక్రయించారన్న ప్రచారం కామారెడ్డి(Kamareddy) జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 50 మందికి ఈ తరహా సర్టిఫికెట్లు అమ్మినట్లు సమాచారం అందుతుండటంతో ఈ వ్యవహారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Fake Engineering Certificates | చదవకుండానే ఇంజినీరింగ్​ సర్టిఫికెట్లు..

చదవకుండానే రూ.2-3 లక్షలు చెల్లించి 90 నుంచి 99 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పట్టాలు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లు కష్టపడి చదివి, రూ.లక్షలు ఖర్చుచేసి పట్టా పొందాల్సిన చోట డబ్బుతోనే సర్టిఫికెట్ కొనుగోలు చేశారన్న ప్రచారం నిజాయితీగా చదివిన విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాడ్వాయి మండలంలోని రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ తరహా సర్టిఫికెట్లు పొంది విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇదే విషయమై నెల రోజుల క్రితం తాడ్వాయి పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాలు పొందినట్లు, మరికొందరు విదేశాలకు వెళ్లినట్లు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిపైనా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సర్టిఫికెట్లను ఉద్యోగాలు, ఉన్నత విద్య, వీసాల కోసం వినియోగించారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Fake Engineering Certificates | ఎవరు తయారుచేశారు..ఎక్కడ ముద్రించారు..

సర్టిఫికెట్లు ఎవరు తయారు చేశారు, ఎక్కడ ముద్రించారు, ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది. మధ్యతరగతి కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి, అప్పులు చేసి మరీ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుతో నకిలీ పట్టాలు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడితే ప్రతిభకు విలువ లేకుండా పోతుందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విద్యార్హతలతో ఉద్యోగాలు పొందితే అర్హులైన నిరుద్యోగులకు అవకాశాలు దూరమవుతాయని, సాంకేతిక రంగాల్లో ఇది ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు.

సంబంధిత యూనివర్సిటీ రికార్డులతో సర్టిఫికెట్లను సరిపోల్చి వాటి అసలుదనాన్ని అధికారికంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఈ దందా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా, మధ్యవర్తులు ఎవరు అనే విషయాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, యూనివర్సిటీ అధికారులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఇటీవల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి రాగా ఇద్దరిని అధికారులు సస్పెండ్ కూడా చేశారు.

ఇది కూడా చదవండి: నెలంతా చేస్తే 10వేలు వస్తలే.. గ్రీన్ ఎస్ఎంను బ్యాన్ చేయాలి 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *