Bashar al-Assad Death Sentence | కోర్టు సంచలన తీర్పు.. సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష

సిరియా మాజీ అధ్యక్షుడు బషార్ అల్-అసద్‌కు ఆ దేశ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bashar al-Assad Death Sentence | సిరియా మాజీ అధ్యక్షుడు బషార్ అల్-అసద్‌కు ఆ దేశ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దాదాపు 14 సంవత్సరాల పాటు సాగిన తీవ్ర అంతర్యుద్ధంలో సామూహిక హత్యలు, చిత్రహింసలు, అక్రమ అరెస్టులు, మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఆయన గైర్హాజరీలోనే విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. పసిపిల్లలతో సహా పలువురిని పక్కా ప్రణాళికతో హత్య చేయడం, బంధించిన వారిని చిత్రహింసలకు గురిచేయడం, భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడటం వంటి తీవ్రమైన నేరాలకు అసద్ బాధ్యుడని కోర్టు తేల్చింది. అసద్‌తో పాటు ఆయన పాలనలో కీలక భద్రతాధికారిగా వ్యవహరించిన అతెఫ్ నజీబ్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధించింది.

Bashar al-Assad Death Sentence | అరెస్ట్ వారెంట్ జారీ..

మాజీ అధ్యక్షుడు బషార్ అల్-అసద్‌తో పాటు ఆయన సోదరుడు మహేర్ అల్-అసద్‌ను అంతర్జాతీయంగా అరెస్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 2000వ సంవత్సరంలో తన తండ్రి హఫీజ్ అల్-అసద్ మరణం తర్వాత బషార్ అల్-అసద్ సిరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2011లో ‘అరబ్ స్ప్రింగ్’ ఉద్యమ సమయంలో ప్రజాస్వామ్యం కోసం రోడ్లపైకి వచ్చిన ప్రజలపై అసద్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన బలప్రయోగానికి దిగడంతో అది కాస్తా భయానక అంతర్యుద్ధంగా మారింది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సాగిన అసద్ కుటుంబ ఉక్కుపాదం పాలన, డిసెంబర్ 2024లో తిరుగుబాటుదారులు చేపట్టిన మెరుపు దాడితో అంతమొందింది.

Bashar al-Assad Death Sentence |చట్టపరమైన విచారణ..

తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందే అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయి, ప్రస్తుతం మాస్కోలో ఆశ్రయం పొందుతున్నారు. అధికార మార్పిడి తర్వాత ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం అసద్ హయాంలో జరిగిన అరాచకాలపై చట్టపరమైన విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం విచారణ పూర్తి చేసి ఈ సంచలన తీర్పును వెలువరించింది. దేశంలో జరిగిన మారణహోమానికి బాధ్యులైన వారికి తగిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Junior Colleges TC Issue | టీసీలివ్వకుండా వేధిస్తున్న జూనియర్​ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *