హైదరాబాద్‌ టెక్‌ అద్భుతం.. గాల్లోకి లేవనున్న భారీ కార్గో విమానం ‘జెన్ #2’

Shivam nagarani

హైదరాబాద్‌కు చెందిన డీప్‌-టెక్ ఏరోస్పేస్ స్టార్టప్ ‘బ్లూజే ఏరోస్పేస్’ (BluJ Aerospace) విమానయాన రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గత 4 ఏళ్లుగా స్వదేశీ సాంకేతికతతో సాగిస్తున్న పరిశోధనల ఫలితంగా రూపొందించిన ‘జెన్ #2’ (Gen #2) ప్రోటోటైప్ విమానాన్ని కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. కేవలం ఒకే రకమైన మోడల్‌కు పరిమితం కాకుండా, వివిధ రకాల విమానాలను ఒకే వేదికపై తయారు చేసేందుకు వీలుగా రూపొందించిన ‘వాంటిస్’ (VANTIS) ఆర్కిటెక్చర్ ఆధారంగా ఈ విమానాన్ని తయారు చేశారు. గతంలో 500 కేజీల విభాగంలో దేశంలోనే మొదటి పబ్లిక్ ఫ్లైట్ డెమోని పూర్తి చేసిన ‘జెన్ #1’ విజయవంతం కావడంతో, ఇప్పుడు ‘జెన్ #2’ను రంగంలోకి దించారు. ప్రస్తుతం ఈ విమానానికి సంబంధించిన ఫ్లైట్ టెస్టింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ జెన్ #2 విమానం పూర్తిగా బ్యాటరీ శక్తితో పనిచేస్తుంది. భారీ బరువులను మోసుకెళ్లే లాజిస్టిక్స్ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిని ప్రత్యేకంగా తయారు చేశారు. 500 కేజీల గరిష్ట టేకాఫ్ బరువుతో పనిచేసే ఈ విమానం, ఏకంగా 200 కేజీల కంటే ఎక్కువ బరువున్న సామాగ్రిని సులువుగా మోసుకెళ్లగలదు. ప్రస్తుతం ఈ విమానాన్ని ప్రారంభ కస్టమర్ పైలట్స్, పేలోడ్ టెస్టింగ్ రియల్-వరల్డ్ లాజిస్టిక్స్ మిషన్ల కోసం ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వాంటిస్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా 1 టన్ బరువును మోసే భారీ కార్గో విమానాలను, అలాగే హైడ్రోజన్-ఎలక్ట్రిక్ సాయంతో నడిచే ప్యాసింజర్ విమానాలను కూడా తయారు చేయాలని బ్లూజే ఏరోస్పేస్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆటోమొబైల్ రంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని విమానయానంలో ఈ ప్లాట్‌ఫారమ్ విధానాన్ని తెచ్చామని కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ అమర్ శ్రీవత్సవాయ తెలిపారు. ఒకే ప్లాట్‌ఫారమ్‌పై వేర్వేరు మిషన్లకు సరిపోయే విమానాలను తక్కువ ఖర్చుతో, వేగంగా తయారు చేయడానికి వాంటిస్ సాంకేతికత ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్, ఎక్స్‌ప్రెస్ కార్గో, ఎనర్జీ, ఎయిర్‌పోర్ట్స్ రక్షణ రంగాలకు చెందిన సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇప్పటికే ఒక ప్రముఖ పవర్ సెక్టార్ పీఎస్‌యూతో పైలట్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ ఫెసిలిటీలో 50 మందికి పైగా ఇంజనీర్లతో నడుస్తున్న ఈ సంస్థ, తమ సరికొత్త డిజైన్లపై ఇప్పటికే పేటెంట్ హక్కులను కూడా పొందింది.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *