Living Funeral Ceremony | బతికుండగానే పెద్దకర్మ జరుపుకున్న 80 ఏళ్ల వృద్ధుడు.. హాజరైన రాష్ట్ర మంత్రి

సాధారణంగా ఎవైనా మరణిస్తే వారి సంప్రదాయం ప్రకారం 10 లేదా 13 రోజుల తర్వాత పెద్దకర్మ (దినం) కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Living Funeral Ceremony | సాధారణంగా ఎవైనా మరణిస్తే వారి సంప్రదాయం ప్రకారం 10 లేదా 13 రోజుల తర్వాత పెద్దకర్మ (దినం) కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఆలోచించారు.

తాను బతికి ఉండగానే తన పెద్దకర్మ కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. యూపీలోని బాఘ్‌పత్ జిల్లా జోహ్రీ గ్రామానికి చెందిన చౌదరి బల్జోర్ సింగ్ (80) అనే వృద్ధుడు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన మరణం తర్వాత కుటుంబ సభ్యులు ఏర్పాట్ల కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేక, తానే స్వయంగా దగ్గరుండి ఈ తంతును పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

Living Funeral Ceremony | ఘనంగా సామూహిక విందు..

ఆదివారం బల్జోర్ సింగ్ తన ఇంట్లోనే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం ప్రత్యేక హోమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏకంగా సుమారు 900 మంది అతిథులతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అతిథుల కోసం పూరీలు, రైతా, వివిధ రకాల కూరగాయల వంటకాలు, లడ్డూలతో ఘనంగా సామూహిక విందు ఏర్పాటు చేశారు. ఈ వింతైన వేడుకకు ఉత్తరప్రదేశ్ మంత్రి కేపీ మాలిక్ కూడా ముఖ్య అతిథిగా హాజరుకావడం స్థానికంగా మరింత చర్చనీయాంశమైంది.

Living Funeral Ceremony | మనవడికి తలపాగా..

ఈ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకున్న ప్రధాన ఘట్టం ‘పగడీ’ (తలపాగా) వేడుక. సాధారణంగా కుటుంబ పెద్ద మరణించిన తర్వాత వారసుడికి తలపాగా కట్టి బాధ్యతలు అప్పగిస్తారు. అయితే బల్జోర్ సింగ్ తన సమక్షంలోనే ఈ తంతును జరిపించారు. సుమారు 10 సంవత్సరాల వయసున్న తన మునిమనవడు ముకుల్‌కు స్వయంగా తలపాగాను అందించి, భవిష్యత్తులో కుటుంబాన్ని ముందుకు నడిపించే బాధ్యతలను ప్రతీకాత్మకంగా అతనికి అప్పగించారు. తనకు ముగ్గురు కుమార్తెలు, వ్యవసాయ భూమి ఉన్నాయని.. తాను జీవించి ఉండగానే అందరినీ ఒకచోట చేర్చి, వారితో కలిసి సంతోషంగా గడపాలనే కోరికతోనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బల్జోర్ సింగ్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: PM Modi Philippines Visit | ఫిలిప్పీన్స్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *