అక్షరటుడే వెబ్‌డెస్క్: CDSCO Drug Safety | తలనొప్పి, ఒళ్లు నొప్పులు రాగానే వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకోవడం.. జలుబు, గొంతునొప్పి రాగానే సొంతంగా యాంటీబయాటిక్స్ ( Antibiotic )వాడేయడం చాలామందిలో కనిపిస్తుంటుంది. అయితే ఎలాంటి వైద్య సలహా లేకుండా ఇలాంటి మందులను పదేపదే వాడటం భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని దేశ అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ (CDSCO) తీవ్రంగా హెచ్చరించింది.
పెయిన్ కిల్లర్లను విచ్చలవిడిగా వాడటం వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని, అలాగే అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ‘యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ (AMR) పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు, ఫార్మసిస్టులు, మందుల విక్రేతలు , ప్రజల కోసం కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
CDSCO Drug Safety | కిడ్నీలకు ముప్పు..
నొప్పి, వాపు తగ్గించేందుకు ఉపయోగించే ‘ఎన్‌సెయిడ్స్’ (NSAIDs) రకం పెయిన్ కిల్లర్లను వైద్యపరంగా అవసరమైనప్పుడు మాత్రమే, సరైన మోతాదులో వాడాలని సీడీఎస్‌సీఓ సూచించింది. చాలామంది చిన్నపాటి తలనొప్పి, కీళ్ల నొప్పులు, జ్వరానికి తరచూ ఈ మందులు వాడుతుంటారు. ఈ అలవాటు ఎక్కువకాలం కొనసాగితే కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది.
కొన్ని పెయిన్ కిల్లర్ మందులు కిడ్నీలకు వెళ్లే రక్తప్రవాహాన్ని తగ్గించగలవు. దీంతో కిడ్నీలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, శరీరంలో నీటిశాతం తగ్గినవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రతి వ్యక్తికి ఒకే రకమైన మందు, మోతాదు సరిపోవని.. వయసు, ఇతర అనారోగ్య సమస్యలను బట్టి డాక్టర్ పర్యవేక్షణలోనే వీటిని వాడాలని స్పష్టం చేసింది.
CDSCO Drug Safety | యాంటీబయాటిక్స్‌తో ముప్పు..
సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, గొంతునొప్పికి సొంతంగా యాంటీబయాటిక్స్ వేసుకోవడం మరో పెద్ద సమస్యగా మారింది. చాలా సాధారణ ఇన్ఫెక్షన్లపై యాంటీబయాటిక్స్ పనిచేయవు. అయినప్పటికీ వాటిని అనవసరంగా వాడితే, మన శరీరంలోని బ్యాక్టీరియా ఆ మందులను తట్టుకునే శక్తిని (రెసిస్టెన్స్) అభివృద్ధి చేసుకుంటుంది. దీనినే ‘యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ (AMR) అంటారు.
ఇలా రెసిస్టెన్స్ పెరిగితే భవిష్యత్తులో సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కూడా మందులు పనిచేయవు. ఫలితంగా చికిత్స మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్‌ను ఆయన చెప్పిన మోతాదు, వ్యవధి వరకు మాత్రమే తీసుకోవాలని.. మిగిలిపోయిన మందులను మళ్లీ వాడటం గానీ, ఇతరులకు ఇవ్వడం గానీ చేయకూడదని హెచ్చరించింది.
CDSCO Drug Safety | కఠిన ఆదేశాలు..
ఈ హెచ్చరికలు కేవలం ప్రజలకే కాకుండా వైద్యులు, ఫార్మసీలకూ వర్తిస్తాయి. షెడ్యూల్ హెచ్ (Schedule H, H1) కిందకు వచ్చే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్లను ప్రిస్క్రిప్షన్ లేకుండా కౌంటర్‌పై విక్రయించకూడదని ఫార్మసీలకు స్పష్టం చేసింది. ఆసుపత్రులు, వైద్య సంస్థలు కూడా మందుల ప్రిస్క్రిప్షన్లను సరిగ్గా పరిశీలించి, రోగులకు తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Market Volatility | ఒడిదుడుకుల్లో మార్కెట్లు