అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Oil Palm Factory | జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. నందిపేట్‌లోని లక్కంపల్లి సెజ్‌ను ఆనుకుని ఉన్న స్థలాలను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ఆయన పరిశీలించారు.
Oil Palm Factory | ఫ్యాక్టరీకి అనువైన స్థలం కోసం..
సెజ్ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కోసం గుర్తించిన స్థలం అనుకూలతపై అధికారులతో చర్చించారు. భవిష్యత్తులో ఇదే ప్రాంతంలో రిఫైనరీ ఏర్పాటుకు సైతం స్థలం అందుబాటులో ఉండడం, పొరుగున ఉన్న నిర్మల్ జిల్లా 50 కిలోమీటర్లలోపే చేరువగా ఉండడాన్ని ఆయన గుర్తించారు. అలాగే రెండు జిల్లాలలో ఇప్పటికే 17వేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగులో ఉండడం, మరో ఐదు వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉండడంతో సెజ్ సమీపంలో ఫ్యాక్టరీ నిర్మాణంపై కలెక్టర్‌తో చర్చించారు. సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. స్థల నిర్ధారణ జరిగిన వెంటనే ఆయిల్ పామ్ ఫాక్టరీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంసిద్ధత తెలిపారని అన్నారు.
Oil Palm Factory | సాగుకు ముందుకు రావాలి..
రైతులు ఆయిల్ పామ్ సాగుకు స్వచ్చందంగా ముందుకు రావాలని సుదర్శన్ రెడ్డి కోరారు. ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున తోడ్పాటును అందిస్తోందని, ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణంలోపే ఈ పంట సాగు చేస్తున్నారని అన్నారు.
Oil Palm Factory | రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమ
జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుతో రైతులకు గణనీయమైన లాభాలు సమకూరడమే కాకుండా, ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్కంపల్లి సెజ్ ప్రాంతంలోని రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమలను కూడా నెలకొల్పేందుకు స్థలాలు అందుబాటులో ఉన్నందున వీటి ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని అన్నారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సేంద్రియ విధానం ద్వారా చేపడుతున్న కూరగాయల సాగు పద్ధతులను అధ్యయనం చేసి, ఇక్కడ కూడా అదే తరహాలో కూరగాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహిస్తామని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియనందున రైతులు నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించాలన్నారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy elderly woman death | కామారెడ్డి కొటారి గల్లీలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి..హత్యా? ప్రమాదమా?..చైన్ స్నాచింగ్ కోణంలో దర్యాప్తు!