TSRTC Merger | ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన..

తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో స్పష్టతనిచ్చారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: TSRTC Merger | తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) శాసనమండలిలో స్పష్టతనిచ్చారు. ఆర్టీసీ విలీనం ఇంకా కార్యాచరణలోకి రాలేదని, ముందుగా గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించిన తర్వాతే పూర్తి స్థాయిలో విలీన ప్రక్రియ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

TSRTC Merger | ఎన్నికల తర్వాతే విలీనం..

మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీతో చర్చల సమయంలోనే గుర్తింపు పొందిన కార్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వంలో విలీనం చేసి 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం కార్మిక శాఖ ప్రత్యేక అధికారిని కూడా నియమించామని, ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తాయని, తెలంగాణలో అటువంటి ఇబ్బందులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోందని తెలిపారు. ఆర్టీసీ జేఏసీతో కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉన్నామని, విలీనంపై ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని ఉద్ఘాటించారు.

TSRTC Merger | రిటైర్డ్ కార్మికుల సమస్యలు..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందనేది అందరికీ తెలుసని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుంచి 2024 మధ్య కాలంలో 13 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ అయ్యారని, వారికి సుమారు రూ. 1152 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని భారీ అప్పుల్లో ముంచేసిందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉందని, ఆర్థిక వెసులుబాటును బట్టి ఆ బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తెచ్చామని, ఆర్టీసీ కార్మికుడు మరణిస్తే కోటి రూపాయల వరకు అందేలా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని గుర్తుచేశారు.

TSRTC Merger | పేదల ఇళ్ల కోసం ఆర్టీసీ స్థలాలు..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ఆర్టీసీ స్థలాలు కేటాయించామని, అవసరమైతే మరిన్ని స్థలాలు ఇస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వమే ఆర్టీసీకి స్థలాలు ఇచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే పరస్పర సమన్వయంతో ఆర్టీసీ భూములు ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కొందరు దీన్ని తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ, కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దీన్ని ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు విమర్శలతో కార్మికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు. ఆర్టీసీ విలీనం తమ ప్రభుత్వ బాధ్యత అని, కాకపోతే దాన్ని హడావుడిగా నేడో రేపో చేయాలని అనడం సరికాదని తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి:  Tata Madhu Dismissal | తాతా మధును డిస్మిస్​​ చేయాలి : సీఎం రేవంత్​ రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *