అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Land Prices | తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. సవరించిన భూముల విలువలు ఎల్లుండి నుంచి అమలులోకి రానున్నాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సవరించిన భూముల విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి అమలులోకి తెస్తున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Telangana Land Prices | శాస్త్రీయ పద్ధతిలో..
ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా, అశాస్త్రీయ పద్దతుల్లో 2021-22 సంవత్సరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల ధరలను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందన్నారు.
Telangana Land Prices | సమస్యలు తలెత్తడంతో..
మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం ఉండటంతో భూ లావాదేవీలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని అన్ని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (SROలు) పరిధిలో మార్కెట్ విలువల పునర్విమర్శ చేపట్టామని మంత్రి వెల్లడించారు. ఫ్లాట్ల విషయంలో గతంలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అంతస్తుల వారీగా అధిక రేట్లు నిర్ణయించడంతో అసమానతలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. అలాంటి ప్రాంతాల్లో అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్లు వివరించారు.
దీనిని కూడా చదవండి : ACB Raids Bhujangarao | భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు
