అక్షరటుడే వెబ్‌డెస్క్: Central Govt Laptop Scheme | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. అధికారిక విధుల నిర్వహణ కోసం అధికారులకు రూ. 1.80 లక్షల వరకు విలువైన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను అందించనుంది. 2026 నవంబర్ 10న ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం (Department of Expenditure) జారీ చేసిన నూతన పరికరాల కొనుగోలు విధానంలో భాగంగా ఈ సదుపాయం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా యాపిల్ (Apple) సంస్థకు చెందిన మ్యాక్‌బుక్ ఎయిర్, ప్రో మోడల్స్‌తో పాటు అల్ట్రాబుక్‌లు, నోట్‌బుక్‌లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు వీటిని నాలుగేళ్ల పాటు ఆఫీస్ అవసరాలకు వాడుకున్న తర్వాత, అవి పూర్తిగా వారి సొంతమవుతాయి.
Central Govt Laptop Scheme | మొబైల్ ఫోన్లకు నో ఛాన్స్..
పరికరాల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ధరల పరిమితులను నిర్దేశించింది. 40 శాతం కంటే ఎక్కువ ‘మేక్-ఇన్-ఇండియా’ (Make-in-India) కంటెంట్ ఉన్న ల్యాప్‌టాప్‌లు లేదా ట్యాబ్లెట్ల కొనుగోలుకు గరిష్టంగా రూ. 1.80 లక్షల వరకు (పన్నులు అదనం) ఖర్చు చేయవచ్చు. ఇతర పరికరాలకు పన్నులతో కలిపి రూ. 1.50 లక్షల వరకు పరిమితి విధించారు. ఈ మొత్తంలోనే స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ఖర్చులు కూడా కలిసి ఉంటాయి. అయితే, ఈ కొత్త జాబితాలో మొబైల్ ఫోన్లకు మాత్రం చోటు కల్పించలేదు.
Central Govt Laptop Scheme | ఎవరికి వర్తిస్తుందంటే?
ఈ నూతన విధానం ప్రకారం పే లెవెల్-12 (Pay Level 12), అంతకంటే పైస్థాయి అధికారులు పూర్తిగా అర్హులు. ఇక పే లెవెల్-8 నుండి 11 వరకు ఉన్న అధికారులలో ప్రారంభంలో మంజూరైన పోస్టుల్లో 50 శాతం మందికి వీటిని కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి ఆయా శాఖల కార్యదర్శి, ఆర్థిక సలహాదారుల సంప్రదింపులతో ఈ పరిమితిని 75 శాతం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. కేవలం కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు , వాటి అధీన కార్యాలయాల ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు (PSUs), స్వయం ప్రతిపత్తి సంస్థలు , కన్సల్టెంట్లకు ఇది వర్తించదు.
Central Govt Laptop Scheme | నాలుగేళ్ల తర్వాత సొంతం..
అధికారులు తమకు కేటాయించిన ల్యాప్‌టాప్‌లను నాలుగేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత శాశ్వతంగా తమ వద్దే ఉంచుకోవచ్చు. అయితే, వ్యక్తిగత అవసరాలకు తీసుకునే ముందు అందులోని అధికారిక డేటా మొత్తాన్ని పూర్తిగా తొలగించాల్సి (Data Wipe) ఉంటుంది. ఒకసారి పరికరం పొందిన తర్వాత నాలుగేళ్ల లోపు మరో కొత్త ల్యాప్‌టాప్ మంజూరు చేయరు. ఒకవేళ పాతది ఏమాత్రం రిపేర్ చేయలేని స్థితికి చేరుకుంటేనే నిబంధనల ప్రకారం కొత్త పరికరాన్ని అందజేస్తారు.
ఇది కూడా చదవండి: India Canada Trade Talks | భారత్, కెనడా మధ్య వాణిజ్య చర్చలు